
YSR Praja News Telugu : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ‘జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్’ సమర్పించిన నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం ఉన్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి వాదనలను గురువారం సమర్పించాలని ఐదుగురు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. రోజుల తరబడి వాదనలు వినడం సాధ్యపడదని, వీలైనంత క్లుప్తంగా ముగించాలని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
పిటిషనర్లకు కొనసాగుతున్న ఊరట
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించినప్పటికీ, తమపై ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు లేదా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, సీఎం మాజీ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం జరిగే తదుపరి విచారణ వరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను (స్టే) ధర్మాసనం పొడిగించింది. దీంతో మాజీ సీఎం సహా ఇతర అధికారులకు తాత్కాలిక ఊరట లభించింది.
క్యాబినెట్ ఆమోదం లేకుండానే వేల కోట్లు విడుదల: ఏజీ
ఈ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనాలను కాపాడే క్రమంలో లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కమిషన్ ఏర్పాటును తప్పుబట్టడం సరికాదన్నారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చట్టపరిధిలోనే పనిచేసిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), కేంద్ర జల సంఘం వంటి సంస్థలు అందించిన అధికారిక పత్రాల ఆధారంగానే సమగ్ర నివేదికను రూపొందించిందని ఏజీ కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో ఎవరినీ బలవంతపెట్టి ఆధారాలు సేకరించలేదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను భారీగా ఉల్లంఘించారని ఏజీ ఆరోపించారు. కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం లేకుండా కేవలం అప్పటి సీఎం, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సంతకాలతోనే వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎత్తిపోతల పథకాలకు భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోందని, అయితే పెట్టిన లక్షల కోట్ల పెట్టుబడికి తగినంత ఆదాయం రావడం లేదని వాదించారు. ఈ సందర్భంగా వివిధ విచారణ కమిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ఏజీ న్యాయస్థానం ముందు ప్రస్తావించారు.




