
గ్రామాలే రాష్ట్రానికి వెన్నెముకలని పేర్కొన్న కేటీఆర్, గ్రామాభివృద్ధి జరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు అధిక నిధులు, అధికారాలు ఇచ్చి, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించామని గుర్తు చేశారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, చెత్త సేకరణ వాహనాలు వంటి సదుపాయాలతో గ్రామాలకు రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు దిండిగల రాజేందర్, ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు ఎప్పుడూ యూరియా కొరత లేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. “షాపుల్లో యూరియా లేకపోతే, యాప్‌ల్లో ఎలా కనిపిస్తుంది? ఇది కేవలం కాగితాల మీద పరిపాలన మాత్రమే” అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అలాగే, రైతులకు, పేదలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కౌలు రైతులకు ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదని, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో ఇచ్చిన హామీలు అమలుకాక ప్రజలు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో కొత్త అభివృద్ధి కార్యక్రమాలు కనిపించకపోగా, కూల్చివేతలు, ఎగవేతలతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాను వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో చెరువులు, కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, రైతులకు కనీస అవసరమైన యూరియా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
కమీషన్ల కోసమే ప్రభుత్వం పని చేస్తోందన్న ఆరోపణలు చేస్తూ, “ప్రతి పనిలో 30 శాతం కమీషన్ వ్యవస్థ నడుస్తోంది. ప్రజల అభివృద్ధి కోసం కాదు, జేబులు నింపుకోవడానికే ఈ పాలన” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు, అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మర్చిపోయారని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఆరు గ్యారెంటీలను భద్రంగా అమలు చేస్తామని చెప్పారని, కానీ రెండేళ్లు గడిచినా ప్రజలకు ఆ ఫలితాలు కనిపించలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల గొంతుకగా నిలబడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు పార్టీకి బలమైన పునాదిగా మారి, ప్రజల సమస్యలను ఉద్యమాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని సూచించారు.
సభ చివర్లో నూతన ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించి, వారికి పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.




