లేబర్ కోడ్స్ – విద్యుత్ సవరణ చట్టాల రద్దు కోరుతూ వికారాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

YSR Praja News Telugu : వికారాబాద్, జనవరి 19: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్, వి బి జి రామ్ జీ విధానాలు, జాతీయ విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా గ్రంథాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజలకు తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నాయని విమర్శించారు.
గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాల అధికారాలను కూడా హరిస్తూ చట్టాలను రూపొందించిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్ల రాయితీలు ఇస్తూనే, కార్మిక సంక్షేమ చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చడం ద్వారా కార్మికుల హక్కులు బలహీనపడ్డాయని తెలిపారు.
కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కును కోల్పోతున్నారని, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛకు ఆటంకం కలుగుతోందని, రోజువారీ పని గంటలు పెంచి శ్రమ దోపిడీకి అవకాశం కల్పిస్తున్నారని వారు పేర్కొన్నారు. అలాగే వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రస్తుతం నిర్వీర్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పని లేకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం కూడా రైతులు, సామాన్య ప్రజలపై భారంగా మారుతుందని హెచ్చరించారు. ఈ చట్టాలన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మైపాల్, జిల్లా కార్యదర్శి సుదర్శన్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సంఘం నాయకులు నరసమ్మ, బాలమణి, రామాంజమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు మంగమ్మ, యాదమ్మ, పద్మ, శోభ, గ్రామపంచాయతీ కార్మిక సంఘం నాయకులు రాములు, అంబరప్ప, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *