
YSR Praja News : అమరావతి:
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోందని పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని సంతకాల రూపంలో వెల్లడించారని తెలిపారు.
ఈ నెల 10వ తేదీన నియోజకవర్గాల నుంచి జిల్లా పార్టీ కార్యాలయాలకు సంతకాల తరలింపు ప్రారంభమవడం ద్వారా ప్రజల మనోభావం మరింత స్పష్టంగా బయటపడిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ… పార్టీ శ్రేణుల సమన్వయంతో ఉద్యమాన్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఉద్యమానికి మరింత ఊపునివ్వాలని, ఈ నెల 15న జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ర్యాలీలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సంతకాల సేకరణలో అంకితభావంతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు సజ్జల తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని విస్మరించే నిర్ణయాలపై ఇది బలమైన ప్రజాస్వామ్య హెచ్చరికగా మారిందన్నారు.
ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల 18వ తేదీ సాయంత్రం వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి గవర్నర్‌కు కోటి సంతకాలను సమర్పించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ నిర్ణయంపై పునఃపరిశీలన జరిగే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.




