పార్టీ ఫిరాయింపుల అంశంపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. పార్టీ మారినట్లు నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంటూ, ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు.
అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి అనే ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. వీరు పార్టీ ఫిరాయించారని చెప్పేందుకు సరైన సాక్ష్యాలు లేవని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ వాదనను ఆయన స్వీకరించలేదు.
స్పీకర్ తీర్పుతో అసంతృప్తి చెందిన బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. స్పీకర్ వద్ద తమకు న్యాయం జరగలేదని బీఆర్ఎస్ శాసనసభా నేత పల్లా రాజేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు.
“బహిరంగంగా కండువాలు కప్పుకుని పార్టీ మారినా చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కోసం కోర్టుల తలుపులు తడతాం” అని పల్లా స్పష్టం చేశారు.