ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు సన్నాహాలు: వికారాబాద్ తాండూర్‌లో కరపత్రాల విడుదల, కార్మికులకు CITU పిలుపు

YSR Praja News Telugu : తాండూర్ మండలం, వికారాబాద్ జిల్లా పరిధిలో సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, గ్రామపంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో బెల్కటూరు, చిట్టి ఘనపూర్ గ్రామాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఫిబ్రవరి 12, 2026న జరిగే దేశవ్యాప్త కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలను విడుదల చేశారు.

నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి: కే. శ్రీనివాస్

సమావేశంలో సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక వ్యతిరేకమని విమర్శించారు. వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని కోరారు.

ప్రజా–కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. 29 కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చేందుకు 2025 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సవరణ చట్టం–2025ను ఉపసంహరించుకోవాలని, పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్లతో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లావ్యాప్తంగా భారీగా పాల్గొనాలి

కనీస వేతనాల అమలు, కాంట్రాక్టు–అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, డిజిన్వెస్ట్‌మెంట్ ఆపాలని కోరుతూ జరగబోయే ఈ సమ్మెలో వికారాబాద్ జిల్లాలోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

పార్లమెంటులో మెజారిటీ బలంతో కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడాన్ని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

సమావేశంలో పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో బెల్కటూరు గ్రామ సమన్వయ కమిటీ కన్వీనర్ మానందమ్మ, కో–కన్వీనర్ తుల్జమ్మ, చిట్టి ఘనపూర్ కన్వీనర్ భీమమ్మ, కో–కన్వీనర్ స్వర్ణలతతో పాటు పద్మ, నర్సిములు, అనిల్ కుమార్, భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *