
YSR Praja News Telugu : వికారాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ వసతి గృహాలలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులకు తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డికి సీఐటీయూ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడం తీవ్రమైన అన్యాయమని పేర్కొన్నారు.
ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో జీవనం కొనసాగిస్తున్న కార్మికులకు నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల అప్పుల భారం పెరిగి, ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా జీతాలు చెల్లించకపోవడం వల్ల తమకు ఎంత వేతనం రావాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందన్నారు. వేతనాలు ఆలస్యం కావడానికి సాంకేతిక లోపాలా లేదా అధికార యంత్రాంగ నిర్లక్ష్యమా అన్నది స్పష్టంగా తేల్చి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వేతనాలు సకాలంలో రాకపోయినా కార్మికులు సెలవులు లేకుండా నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఒకే ఉద్యోగి పలు పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే కార్మికుల ఖాతాల్లో పీఎఫ్ సక్రమంగా జమ కావడం లేదని, విత్డ్రా సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
కావున వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, ప్రతి నెల పీఎఫ్ సక్రమంగా జమ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. సంవత్సరాలుగా విద్యార్థులకు సేవలందిస్తున్న కార్మికులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా కాకుండా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరగనున్న కార్మిక సంఘాల సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ వసతి గృహాల డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు, కార్యదర్శి శశికళ, కమిటీ సభ్యులు మంగమ్మ, లక్ష్మి, బాబ్య నాయక్, గణేష్, భీమమ్మ, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.




