
KTR Slams Congress in Sircilla: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
YSR Praja News Telugu : సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ప్రజలు మరోసారి మోసపోయినట్లేనని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో వందల హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తామంటూ సీఎం చెప్పడం ప్రజలను మభ్యపెట్టడానికే అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే ఎన్ని పంటకాలాలు గడిచాయని ప్రశ్నించిన ఆయన, రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేయడానికి మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డుగా మారతాయని నిలదీశారు. ఎన్నికలు ముగిసే వరకు కాలయాపన చేసి, ఆ తర్వాత మళ్లీ హామీలను పక్కన పెట్టడమే కాంగ్రెస్ విధానమని అన్నారు.
‘కేసీఆర్‌ను తిట్టడం ఎందుకు? పనులు చేయండి’
ప్రజలకు సేవ చేసే అధికారం చేతిలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడకుండా ప్రతిసారి మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే కాంగ్రెస్ నేతల పనిగా మారిందన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు వంటి కీలక సంస్కరణలను రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఇది రాష్ట్ర పాలనను వెనక్కి నెట్టే చర్య అని పేర్కొన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలైన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రెండేళ్లలోనే ఉన్న పథకాలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.
కల్యాణలక్ష్మి, బతుకమ్మ చీరలపై ప్రశ్నలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేసిన కేటీఆర్, ఆ హామీ అమలులో ఎవరికి లాభం చేకూరిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నేతన్నల ఉపాధికి దన్నుగా నిలిచిన బతుకమ్మ చీరల పథకాన్ని నిర్వీర్యం చేయడంతో అనేక కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని అన్నారు.
బీజేపీపై కూడా విమర్శలు గుప్పించిన కేటీఆర్, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా దేవుడి పేరుతో ఓట్లు అడగడం మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలతో నేరుగా కలిసిన కేటీఆర్
ప్రచారంలో భాగంగా కేటీఆర్ సిరిసిల్లలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఒక వార్డు సమావేశంలో ఓ మహిళ చేతిలో ఉన్న చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తూ మాట్లాడటం స్థానికుల్లో ఆకర్షణగా మారింది. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు విన్న కేటీఆర్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.




