ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు పిలుపు: తాండూరులో మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు

YSR Praja News Telugu : తాండూర్: ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న చరిత్రాత్మక సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు (సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తాండూర్ పట్టణంలోని మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ మేనేజర్‌కు సమ్మె నోటీసును అధికారికంగా అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె కీలకమైన పోరాటమని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కుదించేలా ఉన్నాయని, మాహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు, విత్తన సవరణలు, విద్యుత్ సవరణ బిల్లులు ప్రజావ్యతిరేకమని విమర్శించారు.

దేశాన్ని పాలించే ప్రభుత్వాలకు పూర్తి మెజారిటీ ఓట్లు లభించని సందర్భాలు ఉన్నప్పటికీ, కార్మికులు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలంటే కఠినమైన నిబంధనలు విధించడం అన్యాయమని ఆయన ప్రశ్నించారు. కార్మిక సంఘాల్ని నిర్వీర్యం చేసే విధానాలు కొనసాగుతుండగా, కార్పొరేట్ శక్తులకు మాత్రం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లబ్ధిగా అందజేస్తున్నారని ఆరోపించారు.

నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో కార్మిక వర్గ జీవితం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోందని పేర్కొన్నారు. కార్మికుల కష్టార్జితాన్ని ధనవంతుల ప్రయోజనాలకు కేటాయించే విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాల ద్వారానే కార్మిక హక్కులను పరిరక్షించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు, ప్రతి కుటుంబం నుంచి పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు కార్మికులు ఐక్యంగా కదలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం తరఫున కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాద బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *