
YSR Praja News Telugu : ఆదిలాబాద్ టౌన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లకుండా తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేసిన ఆయన, అప్పుడు చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదని హెచ్చరించారు. చట్టాలను, ప్రజల తీర్పును గౌరవించాలని సూచించిన కేటీఆర్, మున్సిపల్ పాలకవర్గాల ఎన్నికలను పెండింగ్‌లో ఉంచకుండా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్‌కు చెందిన 14 మంది కౌన్సిలర్లు గెలిచినా, కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాలు గెలిచినప్పటికీ అధికార దాహంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించకుండా రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ముప్పని అన్నారు.
పోలీసుల వ్యవహారంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. డీజీపీ శివధర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేసినా, అలాగే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా కేసులు నమోదు చేయలేదని గుర్తు చేశారు. అదే సమయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసులు ఎందుకు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ కుటుంబానికి సంబంధించి వెయ్యి కోట్ల వ్యవహారం అంశంపై ఈడీ పాత్ర ఏమిటని ప్రశ్నించిన కేటీఆర్, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంపిక చేసి చర్యలు తీసుకుంటున్నాయా అని సందేహం వ్యక్తం చేశారు. రైతులకు రైతుబంధు సాయం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
రెండేళ్ల కాలంలో ఢిల్లీకి వెయ్యి కోట్ల రూపాయలు చేరవేసేలా ముఖ్యమంత్రి వద్ద సిద్ధంగా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయంటే, రాష్ట్ర ప్రజల సొత్తు మరింతగా దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి రాజకీయ లాభాల కోసమే నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.
బాల్క సుమన్ జైలుకు వెళ్లడం కొత్త విషయం కాదని, తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు జైలు జీవితం అనుభవించిన నేతగా ఆయన పోరాటాలను గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై కేసులు పెట్టడం చరిత్రను అవమానించడమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ ములాఖత్ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మా రాజేశ్వర రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత, కోనేరు కోనప్ప, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ హాజరయ్యారు. కేటీఆర్ రాకతో జైలు పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరి నినాదాలతో హోరెత్తించారు.




