
YSR Praja News Telugu : హైదరాబాద్: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. దీని ప్రభావం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్ట్)పై స్పష్టంగా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో, ప్రయాణికులు దుబాయ్, ఖతార్ తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.
రెట్టింపైన విమాన చార్జీలు
భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ ఎయిర్‌పోర్టులో సేవలు నిలిచిపోవడం, గల్ఫ్ గగనతలం మీదుగా ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. దీంతో విమాన చార్జీలు భారీగా పెరిగాయి.
సాధారణంగా హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు సుమారు రూ. 75 వేలు ఉండే టికెట్ ధర, ఇప్పుడు ఏకంగా రూ. 1.04 లక్షలకు పైగా పెరిగింది.
పారిస్ వెళ్లే విమాన చార్జీలు రూ. 93 వేలు దాటగా, యూకే వెళ్లే చార్జీలు కూడా ఆకాశాన్నంటాయి.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర నగరాల నుంచి అమెరికా, యూరప్ వెళ్లే విమానాలను పసిఫిక్ మహాసముద్రం మీదుగా మళ్లిస్తుండటంతో చార్జీలు దాదాపు రెట్టింపు అయ్యాయని ట్రావెల్ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు
సికింద్రాబాద్‌కు చెందిన వాల్మీకి ట్రావెల్స్ వ్యవస్థాపకుడు హరికిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫ్రికా లేదా ఇటలీ మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి ఇథియోపియాకు నేరుగా విమానాలు ఉన్నాయని, అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ఆఫ్రికా ఖండం మీదుగా వెళ్తున్నారని ఆయన తెలిపారు. తాజా పరిణామాలతో రోమ్ (ఇటలీ) మీదుగా కూడా విమానాలను మళ్లిస్తున్నారు.
తగ్గిన రద్దీ.. క్యాన్సిల్ అవుతున్న టూర్లు
సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికా, దుబాయ్, సౌదీ, సింగపూర్ వంటి దేశాలకు ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కువైట్, ఒమన్, అబుదాబి, సౌదీలకు వెళ్లే విమానాలు రద్దు కావడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది పర్యాటకులు తమ ట్రిప్‌లను క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పనిసరి అయితేనే విదేశీ ప్రయాణాలు పెట్టుకుంటున్నారని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వీసా, ఇతర కార్యకలాపాలు మందగించడంతో హైదరాబాద్‌లోని యూఏఈ కాన్సులేట్ కార్యాలయాలు సైతం వెలవెలబోతున్నాయి.
అమెరికా కాన్సులేట్ వద్ద భద్రత పెంపు
మరోవైపు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 50-1లో ఉన్న అమెరికా కాన్సులేట్ జనరల్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆదివారం ఉదయం నుంచే ఈ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, పటిష్ట నిఘా ఉంచారు.




