ఏపీలో అప్పుల మోత.. రాబడుల కోత: కాగ్ నివేదికలో చంద్రబాబు సర్కార్ ఆర్థిక వైఫల్యాలు బట్టబయలు!

ఏపీలో అప్పుల మోత.. రాబడుల కోత: కాగ్ నివేదికలో చంద్రబాబు సర్కార్ ఆర్థిక వైఫల్యాలు బట్టబయలు!

వైఎస్ఆర్ ప్రజా న్యూస్ డెస్క్, అమరావతి: సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అప్పుల కుప్పలు పేర్చుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందని, రాబడులు పెంచడంలో చంద్రబాబు సర్కార్ దారుణంగా విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి నాటికి రాష్ట్ర బడ్జెట్ సూచికలపై కాగ్ విడుదల చేసిన గణాంకాలు ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు అప్పులు బడ్జెట్ అంచనాలను దాటిపోతుంటే.. మరోవైపు పన్నుల ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, చివరికి పేదల సంక్షేమానికి చేసే ఖర్చు కూడా భారీగా పడిపోవడం గమనార్హం.

బడ్జెట్ అంచనాలను మించిపోయిన అప్పులు

అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 2026) ముగిసే నాటికి మొత్తం రూ.79,926 కోట్లు అప్పు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, గడువు ముగియకముందే, అంటే కేవలం ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.94,393 కోట్లు అప్పుల రూపంలో తెచ్చేసింది. అంటే బడ్జెట్ అంచనాల కంటే అదనంగా మరో రూ.14,467 కోట్ల మేర అప్పు చేయడం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపానికి అద్దం పడుతోంది.

గత ప్రభుత్వంతో పోలిస్తే పడిపోయిన ఆదాయం

రాష్ట్రానికి సొంత ఆదాయం తీసుకురావడంలో బాబు సర్కార్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. 2023-24 (వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాం) ఫిబ్రవరి నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.1,52,820 కోట్లుగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి నాటికి ఆ రాబడి రూ.1,49,546 కోట్లకు పడిపోయింది. అంటే ఏకంగా రూ.3,274 కోట్ల ఆదాయం గల్లంతైంది. సాధారణంగా ఏటా ఆదాయం పెరుగుతుంది, కానీ ఏపీలో మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తుండటం ఆందోళనకరం.

ముఖ్యమైన పన్నుల రాబడిలోనూ తగ్గుదలే (2023-24 vs 2025-26 ఫిబ్రవరి నాటికి):

అమ్మకపు పన్ను (Sales Tax): గతంలో రూ.16,860 కోట్లు రాగా, ఇప్పుడు రూ.16,304 కోట్లకు (రూ.556 కోట్లు మైనస్) పరిమితమైంది.

ఇతర పన్నులు, డ్యూటీలు: గతంలో రూ.6,549 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.4,955 కోట్లే (రూ.1,594 కోట్లు మైనస్) వచ్చింది.

పన్నేతర ఆదాయం (Non-Tax Revenue): రూ.6,740 కోట్ల నుంచి ఏకంగా రూ.5,067 కోట్లకు పడిపోయింది (రూ.1,673 కోట్లు మైనస్).

కేంద్రంలో చక్రం తిప్పుతున్నా… నిధులు ఏవీ?

కేంద్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి చంద్రబాబు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నారు. అయినా సరే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత ప్రభుత్వం (2023-24) ఫిబ్రవరి నాటికి కేంద్రం నుంచి రూ.29,589 కోట్ల గ్రాంట్లు సాధిస్తే, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.14,737 కోట్లు మాత్రమే తేగలిగింది. అంటే ఏకంగా రూ.14,852 కోట్ల మేర కేంద్ర నిధులు తగ్గిపోయాయి.

సంక్షేమంపై పెదవి విరుపు.. పెరిగిన లోటు

ఆర్థిక పరిస్థితి కుంటుపడటంతో దాని ప్రభావం నేరుగా సామాన్యుల సంక్షేమంపై పడింది. విద్య, వైద్యం, మరియు ఇతర సామాజిక రంగాలపై చేసే వ్యయం గతంలో (2023-24 ఫిబ్రవరి) రూ.1,16,413 కోట్లు ఉంటే, ఇప్పుడు అది రూ.1,02,423 కోట్లకు కుదించుకుపోయింది. సామాజిక వ్యయంలో రూ.13,990 కోట్లు కోత పడింది.

ఇక రాష్ట్ర ఖజానాలో రెవెన్యూ లోటు రూ.60,812 కోట్లకు, ద్రవ్యలోటు రూ.91,310 కోట్లకు చేరుకున్నట్లు కాగ్ గణాంకాలు తేల్చి చెప్పాయి. అప్పులు పెంచుతూ, ఆస్తుల సృష్టిని గాలికొదిలేసిన ఈ విధానం రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *