
YSR Praja News Telugu : తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం (ఫిబ్రవరి 04) గుంటూరులో పర్యటించనున్నారు. ఇటీవల రాజకీయ ఉద్రిక్తతల మధ్య టీడీపీ మూకల దాడికి గురై తీవ్ర భయాందోళనలకు లోనైన సీనియర్ నేత, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
గుంటూరులో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి లడ్డూ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ దుష్ప్రచారానికి దిగిందన్న ఆరోపణల మధ్య, దానిని అడ్డుకునే ప్రయత్నం చేసిన అంబటి రాంబాబుపై కర్రలతో దాడి యత్నం జరిగిందని వైఎస్సార్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనల క్రమంలో తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకోగా, చివరకు అంబటి నివాసంపై దాడికి ప్రయత్నం జరిగిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో అంబటితో వైఎస్ జగన్ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, రాత్రివేళ పోలీసులు అంబటిని అరెస్టు చేయడం, సీఎం దుర్భాషలాడారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ ఘటనపై టీడీపీ ప్రభుత్వం వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది కేవలం దాడి కాదని, హత్యాయత్నమేనన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేశారు.
అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై పెట్రోల్ బాంబ్ దాడి జరగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. వరుస ఘటనల నేపథ్యంలో బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి పరామర్శించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్న వైఎస్ జగన్, దాడి జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు. అనంతరం శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలసి ధైర్యం చెప్పనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదివరకే దాడులకు గురైన పార్టీ నేతలు విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడులతో వైఎస్ జగన్ ఫోన్‌లో మాట్లాడి భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రానున్న రోజుల్లో గుంటూరు రాజకీయ వాతావరణం ఎలా మారుతుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.




