మహిళలపై అనుచిత వ్యాఖ్యలు: తీవ్రంగా మండిపడ్డ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బర్తరఫ్ చేయాలని కనీజ్ ఫాతిమా (ఆస్మా) డిమాండ్

YSR Praja News Telugu : రాజకీయాల్లో నైతిక విలువలు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు, బాధ్యత మరచి మహిళల పట్ల అత్యంత అసభ్యకరంగా, అనుచితంగా మాట్లాడుతున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా కూటమి నేత అరవ శ్రీధర్ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి హైదరాబాద్ నగర విభాగం అధ్యక్షురాలు సయ్యదా కనీజ్ ఫాతిమా (ఆస్మా) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సదరు నేతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

స్త్రీని దేవతగా కొలిచే దేశంలో ఈ దారుణాలేంటి?

భారతీయ సమాజంలో స్త్రీకి అత్యున్నత స్థానం ఉందని, స్త్రీలను దేవతలుగా కొలిచే ఈ గడ్డపై ఒక ప్రజాప్రతినిధి స్థాయి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం సిగ్గుచేటని కనీజ్ ఫాతిమా మండిపడ్డారు. మహిళలు హిందువులైనా, ముస్లింలైనా లేదా ఏ మతానికి, ఏ వర్గానికి చెందిన వారైనా.. ముందుగా వారు ఒక మాతృమూర్తి అని ఆమె గుర్తు చేశారు. సృష్టికి మూలమైన మాతృమూర్తుల గురించి ఎంతో బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి, ఒక వస్తువులానో లేక భోగ వస్తువులానో వర్ణిస్తూ మాట్లాడటానికి నోరెలా వచ్చిందని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్త్రీ అంటే కేవలం అనుభవించే వస్తువుగా చూడటం సదరు నేత అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాసేవకుడా? లేక జల్సాలు చేసే వ్యక్తినా?

ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఎందుకో నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఫాతిమా సూచించారు. తమ కష్టాలను, ప్రజా సమస్యలను తీరుస్తారని ఎన్నో ఆశలతో ప్రజలు ఓట్లు వేసి చట్టసభలకు పంపిస్తే.. ఇలా జల్సాలు చేసుకుంటూ, ఎవరిని ఎలాగైనా అనుభవించవచ్చు అనే రీతిలో అహంకారపూరితంగా మాట్లాడటం ప్రజాస్వామ్యానికే చీకటి రోజని అన్నారు. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. మహిళలను కనీసం గౌరవించడం రాని ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఏమాత్రం అర్హులు కారని తేల్చి చెప్పారు. తక్షణమే సదరు నేత తన పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆమె హితవు పలికారు.

పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు?

కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందనపై కనీజ్ ఫాతిమా సూటి ప్రశ్నలు సంధించారు. వేదికల మీద, బహిరంగ సభల్లో మహిళా సాధికారత గురించి, స్త్రీల రక్షణ గురించి చాలా గొప్పగా మాట్లాడే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ కూటమికి చెందిన నేత మహిళలను ఇంత దారుణంగా అవమానిస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడం కోసమైనా, సమాజంలో మహిళలపై ఉన్న గౌరవాన్ని నిలబెట్టడం కోసమైనా ఇలాంటి వ్యక్తులను తక్షణమే పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లేకుంటే తీవ్ర పరిణామాలు

మహిళలను, ప్రత్యేకించి ముస్లిం మహిళలను ఉద్దేశించి చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలకు గాను ఆ నాయకుడు యావత్ మహిళా లోకానికి, ముస్లిం మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కనీజ్ ఫాతిమా డిమాండ్ చేశారు. ఈ అత్యంత సున్నితమైన మరియు గంభీరమైన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి మహిళా లోకానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఒకవేళ ప్రభుత్వం కానీ, కూటమి పెద్దలు కానీ ఈ ఘటనను తేలికగా తీసుకుని, సదరు నేతపై ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో.. సమాజం, వివిధ మహిళా సంఘాల నుండి తీవ్ర స్థాయి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం తాము ఎంతదూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని సయ్యదా కనీజ్ ఫాతిమా (ఆస్మా) స్పష్టం చేశారు.