YSR Praja News Telugu : విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ప్రశ్నించే వారిపై కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిపై, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన నిప్పులు చెరిగారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వారిని గౌరవించే కనీస సంస్కృతి కూడా ప్రస్తుత ప్రభుత్వానికి కరువైందని ఆయన విమర్శించారు.
కక్షసాధింపులకే ప్రాధాన్యత.. పాలనపై నిర్లక్ష్యం
ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచనా చేయడం లేదని బొత్స దుయ్యబట్టారు. యూట్యూబ్ జర్నలిస్టులు రావణ్, కేవీ రెడ్డిల అరెస్టులే ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు తాజా నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ, ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు.
దిగజారిన శాంతిభద్రతలు: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, లాకప్ డెత్లు నిత్యకృత్యంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి కేవలం పర్యటనలకే పరిమితమవుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రజల అవస్థలు: ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలతో గిరిజనులు నరకం అనుభవిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని, కనీసం యూరియా కూడా దొరకని దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని గుర్తుచేశారు. జరిగిపోయిన వాటికే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు, భూమిపూజలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు శంఖుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ కు రెండేళ్లుగా మౌనంగా ఉండిపోయి ఇప్పుడు మళ్ళీ భూమిపూజలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మహిళా రాష్ట్రపతిని అవమానిస్తారా?
దేశ ప్రథమ పౌరురాలు, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వస్తే ఆమెకు స్వాగతం పలికేందుకు కూడా ముఖ్యమంత్రికి తీరిక లేదా? అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.
ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిలో ఉన్నవారు వచ్చినప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రి కచ్చితంగా వెళ్లి తీరాలని, ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోతే అది వేరే విషయమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే ఉండి కూడా చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలకకపోవడం గిరిజనులను, మహిళలను తీవ్రంగా అవమానించడమేనని బొత్స ఆక్షేపించారు.
మరోవైపు ఇక్కడి ఉపముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశాల్లో బిజీగా ఉన్నారని, వీరికి రాజ్యాంగ పదవుల పట్ల ఉన్న కనీస మర్యాద ఇదేనా అని నిలదీశారు. నీతులు చెప్పే వీళ్లకు గౌరవ మర్యాదల గురించి పట్టింపు లేదా అని ప్రశ్నించారు.
మూడు లక్షల కోట్ల అప్పు.. అభివృద్ధి శూన్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, గర్వంగా చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదని బొత్స విమర్శించారు. ఎంతసేపూ వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకుల మీద వ్యక్తిగత దూషణలకే పరిమితం అయ్యారని మండిపడ్డారు.
పెన్షన్ పెంపు మినహా మరే కొత్త పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
ఈ కాలంలో ఏకంగా మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారని, ఆ డబ్బంతా ఎటు పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లే కల్పించి, వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ‘సున్నా వడ్డీ’ పథకానికి ఎగనామం పెట్టారని విమర్శించారు. ఆ ఉచిత బస్సులు కూడా కేవలం స్థానికంగా తిరగడానికే పరిమితమయ్యాయని, దూర ప్రాంతాలకు వెళ్లే సౌకర్యం లేదని ఎత్తిచూపారు.
విద్యావ్యవస్థలో జగన్ మార్కు.. కూటమి వైఫల్యం
ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చి ఇక్కడి స్కూళ్లలో ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్లను చూసి ఆశ్చర్యపోయి ప్రశంసించారని, దానికి ముమ్మాటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని బొత్స స్పష్టం చేశారు. నాడు జగన్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తే, నేటి కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కనీసం స్కూల్ కిట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు.
అమరావతిలో అవినీతి.. సింగపూర్ టౌన్షిప్పై నిలదీత
అమరావతి పేరుతో భారీ అవినీతి జరుగుతోందని, వైఎస్సార్సీపీ విధానం ఎప్పుడూ స్పష్టంగానే ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి మహా నగరం రాజధానిగా ఉంటే, అమరావతి మాత్రం గీతలు గీసుకుని కూర్చున్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
అదే విధంగా, విశాఖపట్నంలో ‘సింగపూర్ టౌన్ షిప్’ నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్న మాటలపై బొత్స అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో అమరావతిలో సింగపూర్ ప్రభుత్వ సహకారంతో ఏదో చేస్తామని మాయమాటలు చెప్పారని, కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ సింగపూర్ టౌన్ షిప్ ఎవరి సహకారంతో చేపడుతున్నారో, ప్రైవేట్ భాగస్వాములతో కడుతున్నారా లేదా ప్రభుత్వంతోనా అనేది చంద్రబాబు ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ తీరుపై అభ్యంతరం.. ఎస్ఐఆర్ గడువు పెంపునకు విజ్ఞప్తి
మీడియా అడిగిన పలు ప్రశ్నలకు బొత్స సమాధానమిస్తూ గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలను తప్పుబట్టారు. అశోక్ గజపతి రాజు తన స్థలంలో వైఎస్సార్సీపీ ఆఫీసు కట్టారని రెండేళ్ల తర్వాత ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు గవర్నర్ పదవే చివరిదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఇలాంటి రాజకీయ ఆరోపణలు చేసి తన గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.
చివరగా, రాష్ట్రంలో ఎస్ఐఆర్ (SIR) నమోదు ప్రక్రియ ఇంకా 36 శాతం కూడా దాటలేదని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా ఎస్ఐఆర్ నమోదు గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని (EC) వైఎస్సార్సీపీ పక్షాన కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం వైయస్సార్ ప్రజా న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి




