YSR Praja News Telugu : యాదగిరిగుట్ట / మోటకొండూర్: రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో సాగిన సస్యశ్యామలమైన రైతు పాలన పోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘రాక్షస పాలన’ మొదలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత కరువు పరిస్థితులు ఎల్నినో వల్ల వచ్చినవి కావని, కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల ఏర్పడిన ‘కృత్రిమ కరువు’ అని ఆయన మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేశ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శోభన్రెడ్డిలతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. హరీశ్రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
లాగ్ బుక్స్ దాచడంపై ఆగ్రహం.. కరెంట్ కోతలపై నిలదీత
చేరికల అనంతరం మోటకొండూర్ లోని విద్యుత్ ఉపకేంద్రాన్ని (సబ్‌స్టేషన్) హరీశ్రావు పరిశీలించారు. తమ పర్యటన సమాచారం తెలుసుకుని విద్యుత్ లాగ్ బుక్లను దాచిపెట్టడంపై స్థానిక అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఎందుకు అందడం లేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యలకు లేదా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి నివాసం, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ఎన్టీఎల్/ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై నిలదీశారు. 22ఏ నిషేధిత భూముల జాబితా, కాంగ్రెస్ అక్రమాలు, భూ కుంభకోణాలను బయటకు తీస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం..
కాంగ్రెస్ నాయకుల ఆరోపణలపై హరీశ్రావు తీవ్రంగా స్పందిస్తూ సవాల్ విసిరారు. “కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబం, ప్రస్తుత మంత్రుల ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధమా?” అని సవాల్ చేశారు. తక్షణమే కృష్ణా, గోదావరి నదీ జలాలను ఎత్తిపోసి ఎండిపోతున్న పంటలను, రైతాంగాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు..
రాష్ట్రంలో తీవ్రమవుతున్న విద్యుత్ కోతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న హరీశ్రావు.. నల్లగొండ జిల్లాలో 4,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మిస్తే కనీసం 1,500 మెగావాట్ల ఉత్పత్తి కూడా చేయడం లేదన్నారు. భద్రాద్రిలో 500 మెగావాట్లు, కొత్తగూడెంలో బొగ్గు లేదనే సాకుతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారని ఆరోపించారు. తెలంగాణలోనే సింగరేణి సంస్థ ఉండి కూడా బొగ్గు కొరత నెపంతో మొత్తం 3,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఆపేసి రైతుల పొలాలకు కరెంట్ కోతలు విధిస్తున్నారని విమర్శించారు. రేవంత్రెడ్డికి పాలన చేతకాకపోవడం వల్లే రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలోకి వెళ్ళిందని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




