ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సంచలన వ్యాఖ్యలు.. నల్సార్ విద్యార్థులపై ప్రశంసలు!

YSR Praja News Telugu : హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ వేదికగా ఆయన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు, విద్యార్థుల హక్కుల గురించి చేసిన ప్రసంగం హాట్ టాపిక్‌గా మారింది. దేశంలో కోట్లాది మందిని ఓటు హక్కుకు దూరం చేసే ఎలాంటి ప్రక్రియ అయినా రాజ్యాంగ విరుద్ధమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో నల్సార్ విద్యార్థులను ‘ధైర్యవంతులు’ అంటూ ఆయన ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆదివారం నల్సార్ యూనివర్సిటీలో జరిగిన ’19వ జస్టిస్ బీఆర్ సావ్నీ మెమోరియల్ మూట్ కోర్టు’ పోటీల ముగింపు కార్యక్రమానికి జస్టిస్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను స్పృశించారు.

ఓటు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపం

ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ జస్టిస్ భూయాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 326లకు విరుద్ధంగా పౌరులను ఓటు హక్కు నుంచి దూరం చేసే ప్రక్రియ ఏకపక్షమైనది. భారత రాజ్యాంగం ఓటు హక్కు ఉన్న పౌరులు, ఓటు హక్కు లేని పౌరులు అంటూ ప్రజలను రెండు తరగతులుగా విభజించదు. ఓటు హక్కు అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలక భాగం. ఆర్టికల్ 326ను ఏ అధికారమూ దెబ్బతీయలేదు. అలాంటి ప్రక్రియలను ఏ కోర్టూ సమర్థించదు” అని ఆయన స్పష్టం చేశారు. మిలియన్ల మంది ఓట్లను తొలగించడాన్ని ఎలాంటి వాదనలతో (వాట్ అబౌటరీ) సమర్థించుకోలేమని తేల్చి చెప్పారు. ఆయన తన ప్రసంగంలో ‘ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, పరోక్షంగా ఈ ప్రక్రియను ఉద్దేశించే ఆయన ఈ హెచ్చరికలు చేసినట్లు స్పష్టమవుతోంది.

నల్సార్ విద్యార్థులు ధైర్యవంతులు..

ఇదే వేదికపై న్యాయ విద్యార్థులను ఉద్దేశించి జస్టిస్ భూయాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్సార్ విద్యార్థులు అద్భుతమైన వారని.. “బ్రిలియంట్, బోల్డ్, బ్రేవ్ (తెలివైన వారు, సాహసికులు, ధైర్యవంతులు)” అంటూ కితాబిచ్చారు. ప్రఖ్యాత న్యాయవేత్త నాని పాల్కీవాలా మాటలను గుర్తుచేస్తూ.. “స్వేచ్ఛను ఒక తరం నుంచి మరో తరానికి అందించాలంటే ప్రతి తరం దానిని కాపాడేందుకు, దాని కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.

ఆ వివాదం నేపథ్యంలోనే ప్రశంసలా?

ఇటీవల నల్సార్‌లో జరిగిన వివాదం నేపథ్యంలో జస్టిస్ భూయాన్ చేసిన ఈ ప్రశంసలు వాడివేడి చర్చకు దారి తీశాయి. గతంలో జస్టిస్ సూర్యకాంత్ కొందరు నకిలీ లాయర్లను ఉద్దేశించి ‘బొద్దింకలు’ అని వాడగా.. అది నిరుద్యోగ యువతను ఉద్దేశించి అన్నారని పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఆ తర్వాత నల్సార్‌లో జరగాల్సిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రాగా, ఆయన చేతుల మీదుగా పట్టాలు తీసుకోబోమని కొందరు విద్యార్థులు నిరసనకు దిగారు. యాజమాన్యానికి లేఖ రాశారు. దీనిపై బార్ కౌన్సిల్ సీరియస్ అయి విద్యార్థులపై చర్యలకు ఆదేశించడం, అనంతరం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బార్ కౌన్సిల్ తీరును తప్పుబట్టడం, చివరకు ఆ కార్యక్రమమే రద్దు కావడం తెలిసిందే. ఈ వివాదాన్ని జస్టిస్ భూయాన్ నేరుగా ప్రస్తావించకపోయినా.. విద్యార్థులను ‘బ్రేవ్’ అనడం గమనార్హం.

జస్టిస్ సూర్యకాంత్‌తో సుదీర్ఘ అనుబంధం

విశేషం ఏమిటంటే.. వివాదంలో నిలిచిన జస్టిస్ సూర్యకాంత్‌తో జస్టిస్ భూయాన్‌కు వృత్తిపరంగా మంచి అనుబంధం ఉంది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న భూయాన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన కొలీజియంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఒక సభ్యుడు. అలాగే 2024లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భూయాన్ ఇద్దరూ కలిసే తీర్పులు వెలువరించారు.

ఎవరీ జస్టిస్ ఉజ్జల్ భూయాన్?

అసోంలోని గువాహటిలో 1964 ఆగస్టు 2న జన్మించిన జస్టిస్ భూయాన్.. 1991లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 2011లో గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం బాంబే, తెలంగాణ హైకోర్టుల్లో పనిచేశారు. 2022 జూన్‌లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో నల్సార్ యూనివర్సిటీకి ఎక్స్-అఫీషియో ఛాన్సలర్‌గానూ ఆయన వ్యవహరించారు. 2023 జూలైలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత కూడా ఆయన న్యాయ విద్యా రంగంతో తనకున్న అనుబంధాన్ని కొనసాగిస్తుండటం విశేషం