వాట్సాప్ మెసేజ్‌కు ‘NO’ అని రిప్లై ఇస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ! కొత్త రకం సైబర్ క్రైమ్‌పై IPS సజ్జనార్ తీవ్ర హెచ్చరిక

YSR Praja News Telugu హైదరాబాద్:సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త పన్నాగంతో అమాయక ప్రజల కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. ఇప్పటివరకు లింకులు క్లిక్ చేయడం, ఓటీపీ (OTP)లు చెప్పడం ద్వారా జరిగే మోసాలను చూశాం. కానీ, ఇప్పుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పకపోయినా, ఏ లింక్ క్లిక్ చేయకపోయినా.. కేవలం వాట్సాప్‌లో ‘NO’ అని ఒక్క రిప్లై ఇచ్చినందుకే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.

ఈ సరికొత్త సైబర్ నేరంపై ఆర్టీసీ ఎండీ, ప్రముఖ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సైతం ఈ రకమైన మోసానికి గురై తన జీవితకాల సంపాదనను కోల్పోయారని తెలిపారు.

ఏంటి ఈ ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’? మోసం ఎలా జరుగుతుంది?

సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’ (Auto-Execution File Attack) మోసం విధానాన్ని సజ్జనార్ వివరించారు:

నకిలీ డెబిట్ మెసేజ్: మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు “మీ ఖాతా నుంచి ఫలానా పెద్ద మొత్తం డెబిట్ అయింది” అని ఒక సందేశం వస్తుంది.

భయాందోళనకు గురిచేయడం: ఆ వెంటనే “ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే ‘NO’ అని రిప్లై ఇవ్వండి” అని రెండో మెసేజ్ పంపుతారు.

ఆటోమేటిక్ మాల్వేర్ యాక్టివేషన్: ఖాతాలో డబ్బులు పోయాయనే కంగారుతో బాధితుడు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే, ఆ మెసేజ్‌లో కనిపించకుండా దాగి ఉన్న మాల్వేర్ స్క్రిప్ట్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

ఫోన్ హ్యాకింగ్: దీనివల్ల క్షణాల్లో మొబైల్ ఫోన్ పూర్తి నియంత్రణ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ వారు ఊడ్చేస్తారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రిప్లై ఇవ్వకండి: గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు ‘YES’ గానీ, ‘NO’ గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వద్దు.

వెంటనే బ్లాక్ చేయండి: కంగారుపడి ఎలాంటి సమాధానం పంపకుండా, ఆ నంబర్‌ను వెంటనే బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయండి.

బ్యాంక్ యాప్‌లో చెక్ చేసుకోండి: మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి నేరుగా మీ అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లా లేదా బ్యాంక్‌కు వెళ్లి చెక్ చేసుకోండి.

బ్యాంకులు వాట్సాప్ రిప్లైలు కోరవు: ఏ అధికారిక బ్యాంక్ కూడా వాట్సాప్‌లో ఇలాంటి ‘YES/NO’ సమాధానాలను కోరదని గుర్తుంచుకోండి.

ఒకవేళ మోసపోతే ఏం చేయాలి?

ఒకవేళ ఎవరైనా ఈ రకమైన సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’ (తొలి గంట) లోనే స్పందించాలని సజ్జనార్ సూచించారు:

వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.

లేదా నేరుగా cybercrime.gov.in అధికారిక పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.

“కంగారులో మీరు ఇచ్చే ఒక్క ‘NO’ అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!” అని సజ్జనార్ హెచ్చరించారు.