YSR Praja News Telugu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోజా మాట్లాడారు.
మహిళలను డబ్బులకు ఆశపడేవారిగా చిత్రీకరించారు
జెండా పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని రోజా మండిపడ్డారు. మహిళలను కేవలం డబ్బులకు ఆశపడేవారుగా చిత్రీకరించడం సిగ్గుచేటని ఆక్షేపించారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకుగాను చంద్రబాబు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
“డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి సందేశాలు చెబితే ఎలా నవ్వుకుంటారో, చంద్రబాబు నీతి వాక్యాలు చెబితే ప్రజలు అలాగే నవ్వుకుంటున్నారు.” — ఆర్కే రోజా, మాజీ మంత్రి
హామీలు అమలు చేయకుండా కుంటిసాకులు
ఎన్నికల ముందు ‘అమ్మ, చెల్లి, తల్లి’ అంటూ సెంటిమెంట్ రాజకీయాలు చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహిళలకు నీతులు చెప్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చరిత్ర చంద్రబాబుదని, డబ్బుతో వ్యవస్థలను మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.
అక్రమ ఆస్తులపై విచారణకు డిమాండ్
కేవలం రెండు ఎకరాల ఆసామిగా ఉన్న చంద్రబాబు ఈరోజు లక్ష కోట్ల ఆస్తులకు ఎలా యజమాని అయ్యారో చెప్పాలని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. స్థానిక నగరి ఎమ్మెల్యే ఇసుక, క్వారీ, గ్రావెల్ దోచుకుంటున్నారని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కనబెట్టారని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిబంధనల ప్రకారం వెంటనే అమలు చేయాలని, సాకులు చెప్పడం మానుకోవాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు.




