YSR Praja News Telugu : తాడేపల్లి: అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా – ATA) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం అందింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను ఆటా ప్రతినిధి బృందం లాంఛనంగా కలిసి మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేసింది.
రాబోయే జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు (2026) అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ 19వ ఆటా మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చిన వారిలో ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా ముచ్చటించారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆటా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఖండాంతరాల్లో తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు వాటి అభివృద్ధికి సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు వారు పాల్గొనే ఈ వేడుకలు.. తెలుగు వారి ఐక్యతను, మన సాంస్కృతిక వైభవాన్ని ఖండాంతరాల్లో మరింతగా చాటిచెప్పాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ సంస్థ సభ్యులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో, అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలు, రాబోయే మహాసభల కోసం చేస్తున్న ముందస్తు ఏర్పాట్ల గురించి ప్రతినిధులు ఆయనకు సవివరంగా తెలియజేశారు.




