క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ‘జైల్ భరో’: తాండూరులో కరపత్రం ఆవిష్కరించిన కార్మిక నాయకులు

YSR Praja News Telugu : తాండూరు (వికారాబాద్ జిల్లా): ఆగస్టు 9 నాటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన తాండూరు పట్టణంలో నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సీఐటీయూ (CITU), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో తాండూరులో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, కేవీపీఎస్ (KVPS) జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.

నాయకులు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు, విమర్శలు:

కార్మిక చట్టాల రద్దుపై ఆగ్రహం:

దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను కాలరాస్తూ, 29 లేబర్ చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో మోడీ ప్రభుత్వం 4 కొత్త లేబర్ కోడ్స్‌ను తీసుకురావడం దారుణమని నాయకులు విమర్శించారు. 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటల పని దినాన్ని అమలు చేయడం కార్మికులకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని, వెంటనే ఆ నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ నిర్వీర్యం:

నిరుపేదలకు జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నీరుగారుస్తోందని మండిపడ్డారు. గతంలో కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వగా, ఇప్పుడు రాష్ట్రం 40% వాటా ఇస్తేనే కేంద్రం 60% ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

రైతులకు కనీస మద్దతు ధర (MSP):

దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు మేలు జరిగేలా తక్షణమే ఎంఎస్పి (MSP) చట్టాన్ని అమలు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ధ్వజం

స్వాతంత్ర్య సంగ్రామంలో ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని రగిలించి భారతీయులంతా ఏకమై బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టారని నాయకులు గుర్తుచేశారు. కానీ, నేటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు, విదేశీయులకు కట్టబెడుతూ దేశ భౌగోళిక స్వరూపాన్ని ధ్వంసం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కార్మికుల సత్తా చాటుతాం..

భారతదేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు, కార్మిక వర్గాన్ని నిలబెట్టేందుకు క్విట్ ఇండియా స్ఫూర్తితో ఎంతటి త్యాగానికైనా తాము సిద్ధమని నాయకులు స్పష్టం చేశారు. కార్మికులతో చెలగాటమాడుతున్న మోడీ ప్రభుత్వానికి రాబోయే కాలంలో కార్మికులు, కర్షకులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈ నెల 10న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఖండిస్తూ చేపట్టే “జైల్ భరో”లో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.