YSR Praja News Telugu : తాండూర్ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో చన్‌గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై భరత్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దళితులు, గిరిజనులు, మైనార్టీలు మరియు పేద రైతుల నుండి వరుసగా ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు పి ఆనంద్ కుమార్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం, పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ క్షేత్రస్థాయిలో బాధిత వర్గాలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు.
పూడూర్ మండలం సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన దళిత రైతు జైదుపల్లి నర్సిములు తన స్వంత పట్టా భూమిలో సుమారు 30 గుంటల భూమిని పొరుగువారు అక్రమంగా ఆక్రమించి ప్రికాస్ట్ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే ఈ ఫిర్యాదును సమగ్రంగా విచారించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు బాధితుడిపైనే FIR No.156/2026 నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
అలాగే చన్‌గోముల్ గ్రామానికి చెందిన రాజు కేసులో, తనపై జరిగిన దాడి మరియు బెదిరింపులపై ఫిర్యాదు చేసినప్పటికీ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. అంగడి చిట్టంపల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతు అంగోతు గణేష్‌ను భూమి వివాదం విషయంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఒత్తిడి, బెదిరింపులకు గురిచేశారని వచ్చిన ఫిర్యాదులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
కండ్లపల్లి గ్రామానికి చెందిన అయూబ్ ఖాన్ తనపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుల పేర్లు తొలగించి కేసు నమోదు చేశారని జిల్లా ఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ పరిణామాలు చన్‌గోముల్ పోలీస్ స్టేషన్‌లో చట్టబద్ధమైన విధి నిర్వహణ జరుగుతోందా లేదా అనే సందేహాలను పెంచుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు.
ముఖ్యంగా ఎస్సై భరత్ రెడ్డి వ్యవహారంపై వచ్చిన ఆరోపణలు ఒక్క వ్యక్తి చేసినవి కాకుండా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, రైతులు తదితర వర్గాలకు చెందిన పలువురు బాధితులు వేర్వేరు సందర్భాల్లో చేసినవని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిష్పాక్షిక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లా ఎస్పీ, డీఐజీ మరియు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై భరత్ రెడ్డిని విచారణ పూర్తయ్యే వరకు విధుల నుండి తప్పించి, స్వతంత్ర అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే కఠిన శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే బాధితుల ఫిర్యాదులను పునర్విచారణ చేసి వారికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, ఎస్సీ-ఎస్టీ-బీసీ మైనార్టీ కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు కే చంద్రయ్య, కెఎన్పిఎస్ జిల్లా నాయకుడు జి రత్నం, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూర్ ఇంచార్జి ఎండి సాదిక్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




