​12 ఏళ్ల చిన్నారిపై దారుణం.. మానవ మృగం గౌస్ పాషాను బహిరంగంగా ఉరితీయాలి తాండూర్ ప్రజా సంఘాల నిరసన

YSR Praja News Telugu : తాండూరు, జూన్ 14: ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణ అఘాయిత్యానికి నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన మానవ మృగం గౌస్ పాషాను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ, ఆదివారం (14-06-2026) తాండూరు పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ‘ప్రజాసంఘాల ఐక్యవేదిక’ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందించాలి:

ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, తక్షణమే భారీ ఆర్థిక సహాయం ప్రకటించి ఆదుకోవాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా అధ్యక్షులు ఎస్. రవీందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దెముల్ కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి:

ప్రజాసంఘాల ఐక్యవేదిక తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పసికందుపై జరిగిన ఈ పైశాచిక దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడైన గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు తక్షణమే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు (Fast Track Court) ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు, ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా ప్రభుత్వం పూర్తి పోలీసు రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

నిరసనలో పాల్గొన్న ముఖ్య నాయకులు:

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అబ్దుల్ వహబ్ (మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు)

కొత్తూరు చంద్రయ్య (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు)

కె. శ్రీనివాస్ (సిఐటియు జిల్లా కార్యదర్శి)

ఉప్పలి మల్కప్ప (కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి)

గుమ్మడి రత్నం (కెఎన్పిఎస్ జిల్లా నాయకులు)

వెంకటయ్య దౌల్తాబాద్ (తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు), లక్ష్మీ, లలిత (జిల్లా మహిళా అధ్యక్షురాళ్లు)

అన్నారం సాయిలు, నాగేష్ గొటికె (అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు)

జుంటుపల్లి అంజి, సంపత్, సానప్ప, బుగ్గన్న, మంతటి రాజు (మూఢనమ్మకాల నిర్మూలన కమిటీ సభ్యులు)

బల్ రాం, వై.రాములు, డి.రాజు, యం.వెంకటేష్ (ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు, నాయకులు) తదితరులు పాల్గొని నిందితుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.