YSR Praja News Telugu : హైదరాబాద్: నగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల దందా బట్టబయలైంది. ఎంబీబీఎస్ చదవకపోయినా, కనీస వైద్య పరిజ్ఞానం లేకపోయినా.. నర్సులు, కాంపౌండర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, చివరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిన వారు సైతం డాక్టర్లుగా అవతారమెత్తారు. ఇటీవల చోటుచేసుకున్న రోగుల మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు నిర్వహించి 12 మంది నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు.
ఈ దాడుల్లో భారీగా ఔషధాలు, వైద్య పరికరాలు, డాక్టర్ల పేరుతో ఉన్న లెటర్ హెడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారం తెలిపారు. ఇన్స్పెక్టర్లు జె.రాజశేఖర్, సీహెచ్ యదేందర్ తో కలిసి ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన ఒక్కో నకిలీ డాక్టర్ వెనుక ఒక్కో విస్తుపోయే కథ ఉందని వారు తెలిపారు.
పట్టుబడిన నకిలీ డాక్టర్లు.. వారి నేపథ్యాలు ఇవే:
వ్యాపారం కోసం క్లినిక్: కేపీహెచ్‌బీకి చెందిన డి.రామశేఖర్ రెడ్డి, తన భార్య ఫార్మసీ సర్టిఫికెట్తో రహమత్ నగర్లో మెడికల్ షాపు నడుపుతున్నాడు. గిరాకీ తగ్గడంతో, దాన్ని ‘శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్’గా మార్చాడు. అనస్థీషియా టెక్నీషియన్ కోర్సు చేసిన రాగం సుధాకర్‌ను డాక్టర్‌గా కూర్చోబెట్టి, రోజుకు 50 మందికి పైగా వైద్యం చేస్తూ రూ.200 చొప్పున ఫీజు వసూలు చేస్తున్నాడు.
కూతురి సర్టిఫికెట్తో తండ్రి వైద్యం: షేక్ పేటకు చెందిన బాల నరసింహ మెడికల్ స్టోర్ నడుపుతున్నాడు. ఆయన కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె సర్టిఫికెట్ అడ్డం పెట్టుకుని దుకాణం పక్కనే ఏకంగా క్లినిక్ తెరిచి, తండ్రే స్వయంగా రోగులకు వైద్యం చేస్తున్నాడు.
తండ్రి సర్టిఫికెట్తో కొడుకు ప్రాక్టీస్: సికింద్రాబాద్‌కు చెందిన ఎ. సందానీ తండ్రి చర్మ వ్యాధుల నిపుణుడు. ఇంటర్ మాత్రమే చదివిన ఇతడు, తండ్రి సర్టిఫికెట్ పెట్టుకుని నల్లగుట్టలో నాలుగేళ్లుగా క్లినిక్ నడుపుతున్నాడు. రోగులకు హానికరమైన రసాయనాలు కలిపిన పెట్రోలియం జెల్లీని ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నర్సు కాస్తా పీడియాట్రిక్ డాక్టర్‌గా: తూప్రాన్‌కు చెందిన మిరుదొడ్డి భారతి గతంలో నర్సుగా పనిచేసింది. ఆ అనుభవంతో రహమత్ నగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి, ఏకంగా చిన్న పిల్లల డాక్టర్ (పీడియాట్రిక్)గా చలామణి అవుతోంది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మూసేసి: బీఏ చదివిన కాటిక మహేష్ రావు (జూబ్లీహిల్స్), ఫాస్ట్ ఫుడ్ వ్యాపారంలో నష్టం రావడంతో రాత్రికి రాత్రే డాక్టర్‌గా మారిపోయాడు. వెంకటగిరిలో రెండేళ్లుగా క్లినిక్ నడుపుతున్నాడు.
ల్యాబ్ టెక్నీషియనే డాక్టర్: ఇంటర్ మధ్యలో ఆపేసిన మహమ్మద్ అబ్దుల్ వలీ, ల్యాబ్ టెక్నీషియన్‌గా చేసిన అనుభవంతో గంగానగర్ వద్ద క్లినిక్ తెరిచి వైద్యుడిగా మారిపోయాడు.
కాంపౌండర్ల క్లినిక్‌లు: డిగ్రీలు, ఇతర కోర్సులు చేసి కొన్నాళ్లు కాంపౌండర్లుగా పనిచేసిన ఎన్. ప్రసాద్, ఎం.శ్రీనివాస్, పి.సదానంద్, సీహెచ్ రమేష్, ఎస్. లింగయ్య.. వివిధ ప్రాంతాల్లో (చిలకలగూడ, లోయర్ ట్యాంక్ బండ్, మాణికేశ్వర్ నగర్) క్లినిక్ లు తెరిచి ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పరిస్థితి విషమిస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




