జడ్చర్లలో ఘోరం: పెళ్లి పీటలెక్కాల్సిన యువతి దారుణ హత్య.. స్థానికుల దేహశుద్ధితో ఉన్మాది కూడా మృతి!

YSR Praja News Telugu : మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం సాయంత్రం అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఒక యువతిని నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేసిన ఓ ప్రేమోన్మాది.. అనంతరం స్థానికుల చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

దాడి జరిగిన తీరు

బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి (23) పోలేపల్లి సెజ్‌లోని ఎస్పీకేఎం (SPKM) స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో విధులు ముగించుకుని, తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. తేజ అనే యువకుడు ఆమెను వెంటాడాడు. తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో వైష్ణవి తల, మెడపై విచక్షణారహితంగా పొడవటమే కాకుండా.. దారుణంగా గొంతు కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆ యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

స్థానికుల ఆగ్రహం.. దేహశుద్ధి

హత్య అనంతరం పారిపోయేందుకు యత్నించిన నిందితుడు తేజను స్థానికులు గమనించి వెంబడించి పట్టుకున్నారు. అతని కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి తీవ్రంగా చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయగా.. ఆగ్రహంతో ఉన్న స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు తీవ్రంగా గాయపడిన తేజను జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు, 108 అంబులెన్స్‌లో వైష్ణవిని జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. కన్నీరుమున్నీరుగా కుటుంబం

ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న రాంచంద్రయ్య, శ్రీలత దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో హతురాలు వైష్ణవి పెద్ద కూతురు. ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెలలో నిశ్చితార్థం జరిపి, మరో రెండు నెలల్లో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. “మరో వంద అడుగులు వేసి ఉంటే మా బిడ్డ సురక్షితంగా ఇంట్లోకి వచ్చేది.. ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయింది” అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. దాడి చేసిన యువకుడు ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని వారు స్పష్టం చేశారు.

నిందితుడి వాదన ఇదీ..

యువతిని హత్య చేసి పారిపోతుండగా పట్టుకున్న స్థానికులు.. నిందితుడు తేజను విచారించగా పలు విషయాలు వెల్లడించాడు. వైష్ణవి తనను రెండేళ్లుగా ప్రేమ పేరుతో మోసం చేసిందని, తన వద్ద ఉన్న డబ్బులు తీసుకుందని అతడు స్థానికుల ముందు ఆరోపించాడు. ఈ కోపంతోనే తాను ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.