YSR Praja News Telugu : తాండూర్, జూన్ 23: తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రిని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH) పరిధి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) పరిధిలోకి మార్చే ప్రభుత్వ నిర్ణయంపై దళిత ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దశాబ్దాలుగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రుల నిర్వహణలో ఇలాంటి మార్పులు తీసుకురావడం సరైన నిర్ణయం కాదని సంఘాల నాయకులు విమర్శించారు.
మంగళవారం తాండూరులో నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు చంద్రయ్య, టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండి సాదిక్ మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సిబ్బందిని బదిలీ చేయొద్దు
ప్రస్తుతం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా యథావిధిగా అక్కడే కొనసాగించాలని వారు కోరారు. కోడంగల్ మెడికల్ కాలేజీకి అవసరమైన సిబ్బంది కోసం తాండూరులోని ఆసుపత్రి సిబ్బందిని బదిలీ చేయడం కంటే, ఆ కాలేజీ కోసం ప్రభుత్వం అదనంగా కొత్త సిబ్బందిని నియమించాలని సూచించారు.
తాండూరు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల నిర్వహణలో మార్పులు తీసుకురావాలంటే ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ఆసుపత్రుల యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చకుండా, సిబ్బంది బదిలీల ప్రక్రియను కొనసాగిస్తే స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
తాండూరు ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రుల నిర్వహణలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాజు, బాలప్ప, వెంకటప్ప, రాములు తదితరులు పాల్గొన్నారు.




