YSR Praja News Telugu : వికారాబాద్, జూన్ 20: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్మికులు మహబూబ్‌నగర్‌కు భారీగా బయల్దేరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 20, 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ పట్టణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా చర్యలు తీసుకుంటోందని నాయకులు విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి కార్మికుల హక్కులను కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ సంఘం నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో ఉపాధి కూలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైందని తెలిపారు.
రాష్ట్ర మహాసభల్లో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి చేపట్టిన పోరాటాలను సమీక్షించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం, కార్మికుల ఉపాధి భద్రత, సంక్షేమం కోసం చేపట్టాల్సిన ఉద్యమాలకు దిశానిర్దేశం చేయనున్నట్లు వివరించారు.
ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరుకానుండగా, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయ్ రాఘవన్, జాతీయ నాయకుడు బి. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు.
జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు, మున్సిపల్ వర్కర్లు, హమాలీలు, ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లాలప్ప, శివకుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కే. చంద్రయ్య, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూర్ ఇంచార్జి ఎండి సాదిక్, కేఎన్‌పీఎస్ జిల్లా నాయకుడు జి. రత్నం, డి. రాజ్‌కుమార్, ఆరిఫ్, శివ, చంద్రప్ప, నర్సిములు, షబ్బీర్, నారాయణ, సరస్వతి, శ్యామమ్మ తదితరులు పాల్గొన్నారు.




