వైఎస్ జగన్ మూడు రోజుల పులివెందుల పర్యటన.. ప్రజాదర్బార్‌తో పాటు ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మాజీ సీఎం

YSR Praja News Telugu : అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశం కావడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

మంగళవారం పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్ భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో భేటీ అవుతారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు.

జూన్ 24న ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన గట్టు లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను కలుసుకోనున్నారు.

అనంతరం తిరిగి పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని మరోసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారి వినతులను స్వీకరించనున్నారు. రాత్రికి పులివెందులలోనే బస చేయనున్నారు.

మాజీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లను కూడా అధికారులు కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.