అంగన్వాడీ టీచర్లపై అదనపు పనిభారం తగ్గించాలి – ఫిబ్రవరి 12 జాతీయ సమ్మెకు సిఐటియు పిలుపు

YSR Praja News Telugu : కోడంగల్: సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోడంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలని లేదా ప్రీ ప్రైమరీ విద్య బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. అదనపు బాధ్యతలకు తగిన విధంగా వేతనాలు చెల్లించాలని, అంగన్వాడీ టీచర్లకు కేటాయిస్తున్న బీఎల్వో డ్యూటీలు తదితర అదనపు పనిభారాన్ని తగ్గించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, జిల్లా కోశాధికారి బుస్సా చంద్రయ్య, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, ఉపాధ్యక్షులు బాలమణి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ద్వారా అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. పీఎం శ్రీ విద్య పేరుతో ప్రీ ప్రైమరీ కేంద్రాలను ప్రవేశపెట్టి, గ్రామీణ ప్రాంతాల్లో పేదల పిల్లలకు అందుతున్న సేవలను తగ్గించే కుట్ర జరుగుతోందని తెలిపారు.

అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని, మినీ అంగన్వాడీ టీచర్ల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అందుతున్న పోషకాహార సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని వారు స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం పేరుతో పేద ప్రజలపై భారం మోపే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. స్కీమ్ వర్కర్స్‌కు వ్యతిరేకంగా తీసుకొస్తున్న లేబర్ కోడ్స్, జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కోడంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్టు నూతన గౌరవ అధ్యక్షురాలు అన్నారం అరుణ, అధ్యక్షురాలు నవనీత, కార్యదర్శి సంతోష్, ఉపాధ్యక్షులు చంద్రకళ, సహాయ కార్యదర్శులు కే. అరుణ, బాలమణి, సూక్యన, రాములమ్మతో పాటు కమిటీ సభ్యులు వెంకటమ్మ, నరసింగమ్మ, యాదమ్మ, అంజమ్మ తదితర అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *