
YSR Praja News Telugu : కొడంగల్ (వికారాబాద్ జిల్లా): రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ముస్లిం ఖబ్రాస్తాన్‌లు, మైనారిటీ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుండడం తీవ్ర ఆందోళనకరమని తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్ తీవ్రంగా ఖండించారు.
కొడంగల్ మండలం సర్పపూర్ గ్రామం, సర్వే నెంబర్ 43లోని సర్కారీ పరంపొగు భూమిలో సుమారు 150 ఏళ్ల పురాతన ముస్లిం సమాధులు మరియు ఒక పురాతన బావి ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమాధులకు నీడనిచ్చేలా ఉన్న సుమారు 100 ఏళ్ల చింత చెట్లను స్థానిక కాంగ్రెస్ నాయకుడు, పర్సాపూర్ గ్రామ సర్పంచ్ భర్త కె. శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ లేదా అటవీ శాఖల అనుమతి లేకుండా అక్రమంగా నరికివేశారని ఆరోపించారు.
ఈ విషయమై నర్సాపూర్ జామా మసీద్ కమిటీ, పర్సాపూర్ గ్రామం తరఫున వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు ముందుగానే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
మతపరంగా, చారిత్రకంగా, పర్యావరణ పరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ముస్లిం సమాధులు, పురాతన చెట్లను రాజకీయ ప్రభావంతో ధ్వంసం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అబ్దుల్ వాహాబ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రోజురోజుకు ముస్లిం ఆస్తులపై దాడులు జరుగుతున్నా, ముఖ్యమంత్రి గానీ, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ తిరుపతి రెడ్డి గానీ ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.
సమాధులపై ఉన్న చింతచెట్టును అక్రమంగా నరికిన శ్రీనివాస్ రెడ్డి పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తోందని తెలిపారు. లేనిపక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ సోదరులతో కలిసి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని అబ్దుల్ వాహాబ్ హెచ్చరించారు.




