VB-GRAM G 2025 బిల్లుకు వ్యతిరేకంగా సీఐటీయూ ధర్నా పిలుపు

YSR Praja News Telugu : తాండూర్ (వికారాబాద్ జిల్లా):కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తాండూర్ మండల కేంద్రంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, రైతులు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను నిర్వీర్యం చేస్తూ, 2025 పేరుతో వీబీ–గ్రామ్ జీ (VB–GRAM G) 2025 బిల్లు తీసుకురావడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం “తలలేని మొండం”గా మారుతుందని విమర్శించారు.

ఉపాధి హామీని “మిషన్”గా మార్చి గ్యారంటీ రోజగార్, అజీవిక మిషన్ పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త బిల్లు ద్వారా వాస్తవంగా ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. పనిదినాలు 125 రోజులకు పెంచుతున్నట్టు చెప్పి, వాస్తవంలో 60 రోజులు పని నిషేధం విధించడం ద్వారా ఉపాధిని కుదిస్తున్నారని, వ్యవసాయ సీజన్‌లో రైతులకు కూలీల కొరత రాకుండా చూడాలన్న ముసుగులో పేదల ఉపాధిపై దాడి చేస్తున్నారని అన్నారు.

ఇప్పటివరకు ఉపాధి హామీ పనులకు కేంద్రం 90%, రాష్ట్రం 10% వాటా ఉండేదని, ఇప్పుడు రాష్ట్రాలు 40% వాటా ఇవ్వాలి అని చెప్పడం ద్వారా కేంద్రం తన భాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తోందని ఆరోపించారు. పనులను నాలుగు రకాలుగా విభజించి కోట్ల రూపాయల పనులను చేర్చడం అంటే యంత్రాలు, కాంట్రాక్టర్లకు ఉపాధి హామీగా మార్చడమేనని విమర్శించారు.

కేంద్రం నిర్ణయించిన వేతనాలకంటే రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా ఉండాలన్న నిబంధనను కొత్త బిల్లులో తొలగించారని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచాలన్న నిబంధన కూడా రద్దు చేశారని తెలిపారు. ఆధార్ నిబంధన తప్పనిసరి కాదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసినప్పటికీ, ఆధార్ లింక్, కొలతల పేరుతో వేతనాలు, రోజుకు రెండు పూటల హాజరు, KYC వంటి నిబంధనలను చట్టవిరుద్ధంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు బయోమెట్రిక్, AI, GPSలను చట్టబద్ధం చేయడం పేదలను ఉపాధి హామీ నుంచి తొలగించే ప్రయత్నమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామాల్లో ఉపాధి పనిదినాలు తగ్గిపోవడంతో పేదలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే ప్రభుత్వ బాధ్యతగా 100 రోజుల ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మిషన్‌గా మార్చి ఉపాధి అవకాశాలను మరింత కుదించేందుకు ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకువచ్చిందని అన్నారు. అందువల్ల మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే కొనసాగాలి, 2025 కొత్త బిల్లు వద్దు అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి. చంద్రప్ప, శ్రీనివాస్, లాలప్ప, లక్ష్మప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *