గ్రామ పంచాయతీ ఫలితాలతో గులాబీ పార్టీకి నూతన ఉత్సాహం

    YSR Praja News : హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ నింపాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల నేపథ్యంలో, తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీకి ఊపిరి పోశాయని నాయకులు విశ్లేషిస్తున్నారు.

 

 

గ్రామ స్థాయిలో తమ పట్టు ఇంకా నిలకడగానే ఉందన్న నమ్మకం బీఆర్ఎస్ శ్రేణుల్లో బలపడుతోంది. మొత్తం 12 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో సుమారు 40 శాతం సర్పంచ్ స్థానాలు పార్టీకి అనుకూలంగా ఉన్న అభ్యర్థులు గెలుచుకున్నట్లు బీఆర్ఎస్ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

 

కేడర్ బలం ఇంకా అలాగే

 

ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో సమన్వయంతో పనిచేయడం వల్లే అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగామని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. కేడర్ చూపిన పట్టుదల, అంకితభావం పార్టీకి బలమైన ఆధారంగా మారిందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం, పాలనపై పెరుగుతున్న అసంతృప్తి తమకు కలిసి వచ్చాయని గులాబీ శిబిరం విశ్లేషిస్తోంది. పల్లెల్లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని అంటున్నారు.

 

బీజేపీ ప్రభావం పరిమితం

 

ఆదిలాబాద్, నిర్మల్ వంటి కొన్ని ప్రాంతాలను తప్పితే గ్రామీణ తెలంగాణలో బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించలేదని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు ఆ పార్టీ గ్రామ స్థాయిలో బలపడినట్లు సూచించవని, పంచాయతీ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయని అంటున్నారు.

 

భవిష్యత్ పోరాటాలకు సన్నాహాలు

 

పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది.

 

ఈ నెల 21న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యక్రమాలు, సంస్థాగత కార్యాచరణపై పార్టీ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశముందని సమాచారం.

 

అలాగే అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా క్షేత్ర స్థాయిలో ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు నేతలు చెబుతున్నారు.

 

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను జిల్లాలు, నియోజకవర్గాల వారిగా సమీక్షించి, బలహీనతలపై పోస్ట్‌మార్టమ్ చేయడంతో పాటు, అసెంబ్లీ–లోక్‌సభ ఎన్నికల తర్వాత ఫిరాయింపులతో బలహీనమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *