
YSR Praja News Telugu : ఇరాన్‌పై సైనిక దాడులకు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ట్రంప్ వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధాలేనని, అది కేవలం నకిలీ వార్త (Fake News) అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘిర్ గాలిబాఫ్ తీవ్రంగా కొట్టిపారేశారు.
ట్రంప్ అసలు ఏం చెప్పారు?
సోమవారం నాడు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ఖాతా ద్వారా ట్రంప్ ఓ కీలక పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య గత రెండు రోజులుగా సానుకూల చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. “ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా ఒక శుభవార్త చెబుతున్నాను. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని మా సైన్యాన్ని ఆదేశించాను” అని ట్రంప్ ఆ పోస్ట్‌లో వెల్లడించారు.
ఖండించిన ఇరాన్ స్పీకర్.. ఆ రెండు కారణాలేంటంటే!
ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ తన అధికారిక ‘ఎక్స్’ (X) ఖాతా వేదికగా తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడితో ఇరాన్ ఎలాంటి చర్చలు జరపలేదని తేల్చి చెప్పారు. ట్రంప్ కావాలనే ఇలాంటి నకిలీ వార్తలను సృష్టిస్తున్నారని, దీని వెనుక ప్రధానంగా రెండు వ్యూహాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు:
చమురు ధరల నియంత్రణ: అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభాన్ని కప్పిపుచ్చి, మార్కెట్‌లో ఆయిల్ ధరలను దించేందుకే ట్రంప్ ఈ నాటకానికి తెరతీశారు.
దృష్టి మళ్లించే యత్నం: యుద్ధ క్షేత్రంలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమి వాస్తవంగా ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికే ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..
తమ దేశ సార్వభౌమాధికారంపై దాడికి తెగబడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష పడాల్సిందేనని ఇరాన్ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని గాలిబాఫ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో యావత్ ఇరాన్ దేశం ఐకమత్యంగా ఉందని, తమ లక్ష్యం నెరవేరే వరకు దాడులకు బదులు తీర్చుకునే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని ఆయన అమెరికా, ఇజ్రాయెల్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.




