
- YSR Praja News Telugu : హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ (BRS) శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏమాత్రం స్వచ్ఛత, స్పష్టత లేదని ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, హామీల ఉల్లంఘనలను ఎండగట్టారు.
- అది అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం!
- గత బడ్జెట్‌లు కేవలం ‘గాలి మాటలు’గా మిగిలిపోతే, ప్రస్తుత బడ్జెట్ పూర్తిగా ‘అవాస్తవాల కోట’ను తలపిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఆకాశమంత హామీలు ఇచ్చిన కాంగ్రెస్, బడ్జెట్‌లో మాత్రం అరకొర నిధులే కేటాయించి ప్రజలను దగా చేసిందన్నారు. ముఖ్యంగా అన్నదాతల పరిస్థితి ‘గోడ దెబ్బ.. చెంప దెబ్బ’ అన్నట్లు తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ‘అభయహస్తం’ కాస్తా, ఇప్పుడు రైతుల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- రుణమాఫీపై ఎక్కడికైనా వస్తా.. సవాల్‌కు సిద్ధమా?
- రైతు రుణమాఫీ రాష్ట్రంలో ఎక్కడా పూర్తిగా అమలు కాలేదని హరీశ్ రావు ఆరోపించారు. రుణమాఫీ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కానీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిర కానీ.. ఎక్కడికైనా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి తాను సిద్ధమని, ప్రభుత్వానికి దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలని సవాల్ విసిరారు.
- కరోనాలోనూ అండగా నిలిచాం.. మీ హామీలు ఏమాయె?
- కరోనా కష్టకాలంలో ఆదాయం పడిపోయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఆగకుండా ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఎకరాకు రూ. 15,000 చొప్పున ‘రైతు భరోసా’ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ గాల్లో కలిసిపోయిందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఒక ప్రహసనంగా మారిందని, గత యాసంగి బోనస్ రూ. 1,161 కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12,000 ఇస్తామన్న హామీ నెరవేరలేదని, బడ్జెట్‌లో పంటల బీమా ఊసే లేదని దుయ్యబట్టారు. “బోనస్ బోగస్ అయ్యింది.. బీమా బూటకమయ్యింది” అని ఆయన ప్రాసతో విమర్శించారు.
- నిరుద్యోగుల ఆశలపై నీళ్లు.. లాఠీ దెబ్బలే మిగిలాయి!
- ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న సర్కార్, బడ్జెట్‌లో ఆ ప్రస్తావన తేలేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని హరీశ్ రావు ప్రశ్నించారు. “ఓట్ల కోసం అశోక్ నగర్ లైబ్రరీల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కాంగ్రెస్ పెద్దలు.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు అడుగుతున్న నిరుద్యోగుల తలలు పగలగొడుతున్నారు. విమానం మోత మోగిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు దక్కింది కేవలం డిప్రెషన్, సప్రెషన్ (అణిచివేత) మాత్రమే” అంటూ ఓ కవితను చదివి వినిపించారు.
- గాంధీ, ఇందిరమ్మ పేర్లు బద్నాం చేయకండి!
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ యువతకు స్వయం ఉపాధి కల్పన కింద రూ. 6 వేల కోట్లు కేటాయించామని చెబుతున్నా, ఏ ఒక్క యువకుడి ఖాతాలోనూ డబ్బులు పడలేదని విమర్శించారు. అమలు చేయని పథకాలకు రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ పేర్లు పెట్టి ఆ మహనీయులను ఎందుకు బద్నాం చేస్తున్నారని నిలదీశారు. సీఎం రేవంత్‌కు వారిపై ఎలాగూ నమ్మకం లేదని, డిప్యూటీ సీఎం భట్టి అయినా ఆలోచించాలని హితవు పలికారు. “ఈ పథకాలకు ‘రేవంత్ ఆత్మీయ మోసం’ అనో, ‘భట్టి గారి యువ భ్రమలు’ అనో పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది” అని ఎద్దేవా చేశారు.
- మహిళల రుణాల జీవో ఏది? ప్రాజెక్టుల హామీ ఏమైంది?
- డ్వాక్రా మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు (ఒక్కొక్కరికి రూ. 20 లక్షల వరకు) ఇస్తామన్న కాంగ్రెస్, బడ్జెట్‌లో ఆ ముచ్చటే మర్చిపోయిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రుణాల జీవోను వెంటనే బయటపెట్టాలని, లేదంటే రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారని, 11 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తామన్న హామీ నీటిమూటగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని, ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని, 420 హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందని హరీశ్ రావు మండిపడ్డారు.




