డిసెంబర్‌లో రికార్డు చలి: తెలంగాణలో 23 రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు

YSR Praja News : హైదరాబాద్: డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో చలి తీవ్రత

ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ నెల తెలంగాణలో అసాధారణంగా చలి తీవ్రతను చూపిస్తోంది. సాధారణంగా చలికాలంలో నాలుగు నుంచి ఐదు రోజులపాటు మాత్రమే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. అనంతరం రెండు మూడు రోజుల్లో మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

డిసెంబర్ నెల ప్రారంభం నుంచే వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న చల్లని గాలులు చలి తీవ్రతను మరింత పెంచుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఈ నెలలో ఇప్పటివరకు గడిచిన 25 రోజుల్లో ఏకంగా 23 రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడం విశేషం. గత పదేళ్లలో ఇంత ఎక్కువ కాలం పాటు చలి తీవ్రంగా కొనసాగడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మరో ఐదు రోజులు చలి తగ్గే సూచనలు లేవు

రానున్న ఐదు రోజుల పాటు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని వెల్లడించింది.

అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదవుతాయని తెలిపింది. జనవరి నెలలోనూ చలి తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

తిర్యాణిలో అత్యల్ప ఉష్ణోగ్రత

గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది ఇదే రోజున అక్కడ 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం.

అదే విధంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *