
YSR Praja News Telugu : తీన్మార్ మల్లన్న నోరు అదుపులో పెట్టుకో.. వైఎస్సార్‌సీపీ నేత పాకాల దానియేలు స్ట్రాంగ్ వార్నింగ్!
హైదరాబాద్/రాజకీయాలు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలపై, రాజన్న పాలనపై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పాకాల దానియేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మల్లన్న అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాజన్న పాలనపై బురద జల్లడమే..
“ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంతో సకల జనులకు, నిరుపేద విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని తప్పు పట్టడం మల్లన్న వంకర బుద్ధికి నిదర్శనం. రాజన్న సంక్షేమ పాలనకు బురద జల్లే కుట్రలకు మల్లన్న తెరలేపుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య” అని దానియేలు ధ్వజమెత్తారు.
ముందు విద్యార్థుల పక్షాన పోరాటం చెయ్..
స్వార్థ రాజకీయాల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని తీన్మార్ మల్లన్నకు ఆయన హితవు పలికారు. “ముందు అదే ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో విద్యార్థులకు చెల్లించాలని ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ప్రజా పోరాటాలు చేయడం నేర్చుకో” అని చురకలు అంటించారు.
తస్మాత్ జాగ్రత్త.. కర్రుకాల్చి వాత పెడతాం..
మహానేతపై విమర్శలు చేస్తే తెలంగాణలోని వైఎస్సార్ అభిమానులు చూస్తూ ఊరుకోరని పాకాల దానియేలు హెచ్చరించారు. “తెలంగాణలో ఉన్న వైఎస్సార్ అభిమానులు, జగనన్న సైనికులు, బహుజనులు ఏం చేతగాని వాళ్లు కాదు. తస్మాత్ జాగ్రత్త! నోరు అదుపులో పెట్టుకో. మహానేతపై అవాకులు చవాకులు పేలితే కర్రుకాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తుంది” అని ఆయన తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే మల్లన్న బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.




