
YSR Praja News Telugu : హైదరాబాద్/మొయినాబాద్: తెలంగాణ మరియు ఏపీ రాజకీయాల్లో మరో భారీ సంచలనం చోటుచేసుకుంది. గతంలో ‘ఎమ్మెల్యేల కొనుగోలు (Poaching Case)’ వ్యవహారంతో దేశవ్యాప్తంగా మార్మోగిపోయిన బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఇప్పుడు ‘డ్రగ్స్ పార్టీ’తో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. శనివారం రాత్రి ఈ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులకు చెందిన ‘ఈగల్ (EAGLE)’ స్పెషల్ టీమ్ చేసిన ఆకస్మిక దాడిలో డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడటంతో పాటు ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపుతోంది.
దీనికి తోడు, ఈ కేసులో ఏపీకి చెందిన సిట్టింగ్ టీడీపీ ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్ అని పోలీసులే అధికారికంగా ప్రకటించడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
అసలేం జరిగింది? పోలీసులపై కాల్పులు ఎందుకు?
మొయినాబాద్ పరిధిలోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా భారీ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రాత్రి 9:30 గంటల సమయంలో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) టీమ్ అక్కడికి చేరుకుంది. అయితే, ఫామ్‌హౌస్ గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అదనపు బలగాలతో లోపలికి ప్రవేశించిన పోలీసులను చూసి, పార్టీలో ఉన్న ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ‘నమిత్ శర్మ’ పోలీసులను భయపెట్టేందుకు తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ గన్ (జర్మనీ తయారీ 32 బోర్) అని పోలీసులు గుర్తించారు.
డ్రగ్ టెస్టులో దొరికింది ఎవరు? టీడీపీ ఎంపీకి పాజిటివ్!
ఈ హై-ప్రొఫైల్ డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మంది (పది మంది పురుషులు, ఒక మహిళ) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.
ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్: ఈ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ (TDP MP) పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా పట్టుబడ్డారు. శనివారం రాత్రి నిర్వహించిన ప్రాథమిక (యూరిన్) పరీక్షలో ఆయనకు డ్రగ్స్ నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఆదివారం ఉదయం ఆసుపత్రిలో నిర్వహించిన తదుపరి రక్తపరీక్షల్లో (Blood Test) ఎంపీ డ్రగ్స్ (మెథాంపేటమైన్) తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ అధికారికంగా ప్రకటించారు.
మిగతా ఐదుగురు ఎవరంటే?: ఎంపీ మహేష్ కుమార్‌తో పాటు.. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, కాల్పులు జరిపిన నమిత్ శర్మ, బెంగళూరుకు చెందిన న్యాయవాది (డ్రగ్స్ సప్లయర్ అని అనుమానిస్తున్న) కౌశిక్ రవి మరియు అర్జున్ రెడ్డిలకు కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఏమేం సీజ్ చేశారు?
ఈ సోదాల్లో ఫామ్‌హౌస్ స్విమ్మింగ్ పూల్ వద్ద భారీగా విదేశీ మద్యం దొరికింది. ఒకరి వద్ద సుమారు 2 గ్రాముల డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాల్పులకు వాడిన తుపాకీని, ఖాళీ బుల్లెట్ కేసులను, లైవ్ బుల్లెట్లను సీజ్ చేశారు. సిమ్లా నుండి ఈ డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై NDPS (డ్రగ్స్ కంట్రోల్) యాక్ట్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదే ఫామ్‌హౌస్.. అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోలు:
2022లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని ఆరోపిస్తూ దాఖలైన కేసు చోటుచేసుకుంది కూడా ఇదే ఫామ్‌హౌస్‌లో కావడం గమనార్హం. అప్పట్లో తానొక బాధితుడిని అని చెప్పుకున్న రోహిత్ రెడ్డి, ఇప్పుడు తన సొంత ఫామ్‌హౌస్‌లోనే డ్రగ్స్ తీసుకుంటూ ఏపీ ఎంపీతో పాటు అడ్డంగా దొరికిపోవడం తీవ్ర సంచలనంగా మారింది.




