
సుమారు ఎనిమిది నెలల విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్, ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహం, నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగిందన్నారు.
కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో రాజీ పడిందని కేసీఆర్ ఆరోపించారు. కేవలం 45 టీఎంసీల నీటికి మాత్రమే అంగీకరించారని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే నిర్ణయమని అన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా, మండల స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు.
అలాగే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామని కేసీఆర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలే సమావేశంలో ప్రధాన చర్చాంశంగా నిలిచాయన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో కృష్ణా నది సుమారు 308 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని, అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోనూ, రాష్ట్ర విభజన తర్వాతనూ పాలమూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని కేసీఆర్ విమర్శించారు. పాలమూరుకు న్యాయమైన నీటి వాటా కోసం గతంలో పోరాడినవారు లేరని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు మరింత అన్యాయం జరిగిందని తెలిపారు.
పాలమూరు ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు కాదని, గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయని కేసీఆర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ జిల్లా తీవ్ర కరువుతో బాధపడుతోందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలమూరుపై అన్యాయం చేశాయని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడతామని కేసీఆర్ స్పష్టం చేశారు.




