వరకట్నం కోసం అనూష హత్య: నిందితులకు కఠిన శిక్ష విధించాలి – మహిళా, ప్రజా సంఘాల డిమాండ్

YSR Praja News : తాండూరు:ప్రేమించి వివాహం చేసుకుని నమ్మించి మోసం చేసి, అదనపు వరకట్నం కోసం భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తాండూరు పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. సాయిపూర్ ప్రాంతానికి చెందిన అనూషను ఆమె భర్త పరమేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కలిసి కర్రలతో దాడి చేసి చంపిన ఘటనను మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

 

మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో పరమేష్, అతని తల్లిదండ్రులు, తమ్ముడు రమేష్, బాబాయ్ శ్రీనివాస్, అక్కాచెల్లెల్లు కలిసి అనూషపై అమానుషంగా దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ వివాహం చేసుకుని ఎనిమిది నెలలు కూడా గడవకముందే అదనపు వరకట్నం తీసుకురావాలనే కక్షతో అనూషను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి చివరికి కర్రలతో కొట్టి హత్య చేసినట్లు సంఘాలు పేర్కొన్నాయి. 

ఈ దారుణ ఘటన మహిళలపై జరుగుతున్న హింసకు మరో నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేసిన సంఘాల నాయకులు, డ్రగ్స్ మరియు మద్యం ఏరులై పారుతున్న నేపథ్యంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి ఘటనలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అనూష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సంఘాలు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. నిందితులపై కఠినమైన శిక్షలు విధించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. 

ఈ డిమాండ్‌కు కేఎన్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. చంద్రప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అలవెల్లి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సాదిక్, దళిత సంఘం నాయకులు శివకుమార్ తదితరులు మద్దతు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *