
YSR Praja News Telugu : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఇరాన్లో అధికార మార్పు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా భీకర దాడులకు దిగాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ ఊహించని దాడులతో ఇరాన్ అగ్రనాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఖమేనీ పరిస్థితి ఏంటి.. ఎక్కడున్నారు?
సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అనే దానిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఆయన రహస్య ప్రాంతానికి తరలివెళ్లినట్లు కొన్ని వార్తలు వస్తుండగా, ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఖమేనీ కుడిభుజంగా భావించే జనరల్ అలీ ఖంబానితో పాటు పలువురు కీలక కమాండర్లు మృతి చెందినట్లు సమాచారం. ఖమేనీని కచ్చితంగా టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ మీడియా వర్గాలు అయితే ఆయన చనిపోయి ఉండొచ్చని కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అయితే, ఇరాన్ ఆర్థిక మంత్రి మాత్రం ఈ వార్తలను ఖండించారు, తమ లీడర్ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.
అమెరికా ‘మదురో’ స్కెచ్..
గతంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్న తరహాలోనే ఖమేనీని కూడా బంధించాలని అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహరచన చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారీ స్థాయిలో సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అమెరికా నావికాదళం, ముఖ్యంగా ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ యుద్ధనౌక ఇరాన్ జలాల సమీపంలో మోహరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జియోపాలిటిక్స్ నిపుణులు అంచనా వేసినట్లుగానే ఇప్పుడు పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
కలిసివచ్చిన అంతర్గత తిరుగుబాటు
ఇరాన్లో అంతర్గతంగా నెలకొన్న అస్థిరత, ప్రజల ఆగ్రహం అమెరికా, ఇజ్రాయెల్‌కు బాగా కలిసివచ్చింది. 1979 తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలను అణచివేసే క్రమంలో ఐఆర్ జీసీ (IRGC) బలగాలు దమనకాండకు పాల్పడి వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఖమేనీ పాలన అంతం కావాలని స్వయంగా ఇరాన్ పౌరులే కోరుకోవడం.. డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌కు సానుకూల అంశంగా మారింది.
అప్పుడూ ఇప్పుడూ.. మారిన సమీకరణాలు
అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఈనాటిది కాదు. 2012లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ యురేనియం శుద్ధి ప్రకటనతో మొదలైన వైరం.. 2020లో కుడ్జ్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ హతంతో తారాస్థాయికి చేరింది. గత ఏడాది కూడా ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. అప్పట్లో ఇరాన్ ముందస్తు సమాచారం ఇచ్చి మరీ అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిందని చెబుతారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సైనికంగా అమెరికా ఎంతో బలోపేతంగా ఉండగా, ఇరాన్ అంతర్గత తిరుగుబాట్లతో బలహీనపడింది. బాలిస్టిక్ క్షిపణులు, అణుసామగ్రి విషయంలో ఇరాన్ పురోగతి సాధించినప్పటికీ, సొంత ప్రజలే ఎదురు తిరగడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు సుప్రీం లీడర్ ఖమేనీ ఇంకా టెహ్రాన్‌లోనే ఉన్నారా? లేక ప్రాణభయంతో వేరే దేశానికి పారిపోయారా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.




