
YSR Praja News Telugu : తాండూర్:
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారతదేశంలో సామాజిక అసమానతలు, వివక్షలకు కారణమైనది ఆశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రమేనని సామాజిక ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా విమర్శించారు. మనువాదం దేశానికి ప్రమాదకరమైందని, దీనికి మూలమైన మనుస్మృతిని పూర్తిగా నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.
1927 డిసెంబర్ 25న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో వేలాది దళిత-బహుజనులతో కలిసి మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేసిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, గురువారం తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు KNPS, KVPS, CITU, MHPS, Vyakasa, PDSU సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దగ్ధం చేశారు.
వక్తల వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో
KNPS రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రప్ప,
CITU జిల్లా కార్యదర్శి శ్రీనివాస్,
KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య,
MHPS రాష్ట్ర అధ్యక్షులు వాహబ్,
PDSU జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
మాట్లాడుతూ, మనుస్మృతి వేల సంవత్సరాలుగా మనుషుల మధ్య కుల, సామాజిక అంతరాలను సృష్టించి, మెజారిటీ ప్రజలను ప్రకృతి వనరులు, చదువు, భూమి, అధికారాల నుంచి దూరం చేసిందని ఆరోపించారు.
కర్మ సిద్ధాంతం పేరుతో దోపిడీని సమర్థిస్తూ, కొద్దిమంది చేతుల్లో సంపదను కేంద్రీకరించే దుర్మార్గపు వ్యవస్థగా మనువాదం కొనసాగుతోందన్నారు. దీని ఫలితంగా కొందరు కోటీశ్వర్లుగా, కోట్లాది మంది పేదలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ–ఆర్ఎస్ఎస్పై విమర్శలు
మనుస్మృతి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడేందుకు సిద్ధాంతపరమైన పునాదిగా మారిందని, బీజేపీ–ఆర్ఎస్ఎస్–సంఘ్ పరివార్ శక్తులు అదే భావజాలాన్ని కొనసాగిస్తున్నాయని వక్తలు విమర్శించారు.
1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికత, సామాజిక న్యాయం వంటి విలువలను స్థాపించిందని, కానీ వాటిని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అనంతకుమార్ హెగ్డే వంటి బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని, మనుధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించాలనే ప్రయత్నాలు దేశాన్ని మళ్లీ మధ్యయుగాల వైపు నడిపిస్తాయని హెచ్చరించారు.
రాజ్యాంగ రక్షణే దేశ రక్షణ
రాజ్యాంగం ద్వారానే దేశాన్ని కులం, మతం, భాష, ప్రాంత భేదం లేకుండా ఐక్యంగా ఉంచవచ్చని, మనుస్మృతి భావజాలం దేశాన్ని విచ్ఛిన్నం చేసి మతోన్మాదం, కుల ఘర్షణలకు దారితీస్తుందని తెలిపారు.
కావున బహుజన ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, మనువాదాన్ని సమూలంగా తిరస్కరించి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో
స్వేరో జిల్లా నాయకులు శివ,
MHPS టౌన్ అధ్యక్షులు సాజిద్,
వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.




