
YSR Praja News Telugu : తాండూర్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఈ మేరకు తాండూర్ మండలంలో సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీవో, ఎంఈఓ అధికారులకు సమ్మె నోటీసును అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం “శ్రమశక్తి నీతి – 2025” పేరుతో కార్మికులకు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో హక్కులు లేని లేబర్ కోడ్‌లను తీసుకురావడం ద్వారా కార్మిక వర్గాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు.
కొత్త కార్మిక విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా కేంద్ర కార్మిక సంఘాలతో చర్చించి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉండేదని, కానీ అలాంటి సంప్రదింపులు లేకుండానే అప్రజాస్వామికంగా చట్టాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పార్లమెంట్లో కూడా తగిన చర్చ లేకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం చట్టాలను సవరించి కార్మికుల హక్కులను హరిస్తున్నారని తెలిపారు.
ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల విశ్రాంతి, ఎనిమిది గంటల వినోదం అనే కార్మికుల మౌలిక హక్కును తొలగించి 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కార్మికుల జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. మూడు షిఫ్టుల విధానానికి బదులుగా డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ విధానాలు తీసుకురావడం వల్ల కుటుంబ జీవితం దెబ్బతింటోందని అన్నారు.
కాంట్రాక్ట్ విధానం, వలస కార్మికుల సంఖ్య పెంచుతూ కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, వేతన భద్రత వంటి హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో తాండూర్ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు ఎస్. వెంకట్ రాములు, ప్రధాన కార్యదర్శి జి. నర్సింలు, ఉపాధ్యక్షులు జిలాని, బాలప్ప, దస్తప్ప, శాంతమ్మ, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.




