రూ.1,200 ఈ-చలాన్ వివాదం – తెలంగాణ హైకోర్టు కీలక విచారణ

YSR Praja News : హైదరాబాద్:రాష్ట్రంలో అమలులో ఉన్న ఈ-చలాన్ వ్యవస్థ చట్టబద్ధతపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ-చలాన్ పోర్టల్‌లో జరుగుతున్న మార్పులు, అప్డేట్‌లపై పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది.

 

ఈ విషయమై హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌లు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

 

సికింద్రాబాద్‌కు చెందిన వి. రాఘవేంద్రచారి అనే వ్యక్తి, తన ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్‌కు విధించిన చలాన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రూ. 1,200 జరిమానాతో పాటు రూ. 35 యూజర్ చార్జీలతో కలిపి మొత్తం రూ. 1,235 చలాన్ విధించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.

 

ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎన్పీ శ్రవణ్ కుమార్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, చలాన్ విధించే సమయంలో సంబంధిత చట్టపరమైన నిబంధనలను అధికారులు స్పష్టంగా పేర్కొనలేదని వాదించారు.

 

అలాగే ఈ జరిమానా మోటారు వాహనాల చట్టం, కేంద్ర నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. నిబంధనల ప్రకారం రూ. 100 నుంచి రూ. 300 మధ్య మాత్రమే జరిమానా ఉండాల్సి వుండగా, రూ. 1,200 విధించడం అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అధిక జరిమానాల వల్ల మధ్యతరగతి ప్రజలకు భారం పెరుగుతోందని తెలిపారు.

 

ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, చలాన్‌పై అభ్యంతరం ఉన్నవారు సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ వ్యవస్థలో కొన్ని వివరాలు ఇంకా అప్‌లోడ్ కాలేదని, వాటిని త్వరలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

వాదనలు విన్న హైకోర్టు, ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను వా

యిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *