
YSR Praja News : తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… “రైతు నవ్వితేనే రాష్టం అభివృద్ధి దిశగా సాగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అన్నట్టుగా మారిపోయింది” అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు.
“పండుగలా ఉండాల్సిన వ్యవసాయం… బాబు హయాంలో దుర్భరంగా మారింది. మొంథా తుపాను విషయంలో ఎంత హడావుడి చేశారో ప్రజలందరికీ తెలుసు. ప్రజల కష్టాల్లో కూడా రాజకీయాలు మానరు” అని మండిపడ్డారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కుగా లభించిందని జగన్ గుర్తు చేశారు.
“బాబు మాటల్లోనే ఉన్న ఇన్పుట్ సబ్సిడీ… అమలు మాత్రం శూన్యం. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉండగా బాబు పాలనలో కేవలం 19 లక్షల మందికే పంటల బీమా. ఇది రైతులపై జరిగిన అన్యాయం కాదు మరేం?” అని ప్రశ్నించారు.
“ప్రకృతి దెబ్బ – బాబు నిర్లక్ష్యం”
“గత 19 నెలల్లో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు తాకాయి. మా పాలనలో రూ.7,800 కోట్ల ఉచిత పంటల బీమా రైతులకు చేరింది. కానీ బాబు హయాంలో రూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇంకా చెల్లించలేదు” అని జగన్ తెలిపారు.
కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణమైందని ఆయన పేర్కొన్నారు.
“పెట్టుబడి సాయం పేరుతో ఏడాదికి రూ.20 వేలిస్తామని చెప్పి… రెండేళ్లకు రావాల్సింది రూ.40 వేలు. కానీ రైతుల చెంతకు చేరింది కేవలం రూ.10 వేలే. గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల్లోనే కూరుకుపోతున్నారు. దళారులు దోపిడీ చేస్తూ… బాబు మాత్రం చూస్తూ కూర్చున్నారు” అని విమర్శించారు.




