
YSR Praja News Telugu : విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే తెలుగుదేశం పార్టీ ఈ తరహా దాడులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.
శనివారం అంబటి రాంబాబు నివాసంపై, ఆదివారం జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పరిష్కరించుకోవాలే తప్ప, హింసాత్మక దాడులకు తావివ్వడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో ఆరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించిన పేర్ని నాని, పోలీస్ యంత్రాంగం స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ స్థాయి నుంచి కిందస్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లు పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారని, దాడులను అడ్డుకోవద్దనే ఆదేశాలు పై స్థాయి అధికారుల నుంచి వస్తున్నాయని కిందస్థాయి సిబ్బంది చెబుతున్నారని ఆయన ఆరోపించారు.
పోలీసులను అడ్డంపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై దాడులు కొనసాగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్ని నాని అన్నారు. ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా భయభ్రాంతులు సృష్టిస్తున్నారని, ఈ పరిస్థితులు కొనసాగితే వేలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించాలంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర బలగాలను ఏపీకి పంపించి పరిస్థితిని అదుపులోకి తేవాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, హింసకు చోటు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.




