కార్మిక హక్కుల కోసం పోరాటం: ఫిబ్రవరి 12 సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపు

YSR Praja News Telugu : తాండూర్: నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు తాండూర్ పట్టణంలో యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేసి ప్రచారం నిర్వహించారు.

జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు సహా అన్ని కార్మిక వర్గాలు ఐక్యంగా పోరాడి తమ హక్కులను పరిరక్షించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26,000లు నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తొలగింపులు నిలిపివేయాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వంట షెడ్లు నిర్మించాలని, గుడ్లు మరియు వంట గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, “శ్రమశక్తి నీతి–2025” పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాన్ని ప్రకటించి, కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మిక హక్కులను దెబ్బతీసే లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. కొత్త కార్మిక విధానాన్ని ప్రవేశపెట్టాలంటే యూనియన్లు, కేంద్ర కార్మిక సంఘాల భాగస్వామ్యంతో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉండేదని, కానీ అలాంటి ప్రయత్నం చేయకుండానే అప్రజాస్వామికంగా చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించారు.

పార్లమెంట్‌లో సరైన చర్చ లేకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం చట్టాలను సవరించి కార్మిక వర్గ హక్కులను హరించారని ఆయన విమర్శించారు. ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల వినోదం, ఎనిమిది గంటల విశ్రాంతి అనే నినాదాన్ని పక్కన పెట్టి 12 గంటల పని దినాలను పెంచడం ద్వారా కార్మికుల జీవన నాణ్యతను దెబ్బతీశారని పేర్కొన్నారు. మూడు షిఫ్టుల విధానానికి బదులుగా డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్‌లను ప్రవేశపెట్టి కుటుంబ జీవితం దూరం చేస్తున్నారని అన్నారు.

కాంట్రాక్ట్ విధానం, వలస కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, వేతన చెల్లింపుల చట్టాల అమలును బలహీనపరిచారని విమర్శించారు. కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణలోని మధ్యాహ్న భోజన కార్మికులందరూ పెద్ద ఎత్తున ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తాండూర్ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నాయకులు శాంత్ కుమార్, రహిమున్సిబేగం, ముంతాజ్ బేగం, వెంకటమ్మ, రేష్మ బేగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *