హైకోర్టులో హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ — బేషరతు క్షమాపణ

హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ హైకోర్టులో క్షమాపణ — బతుకమ్మకుంట భూ వివాదంపై హైకోర్టు విచారణ

    YSR Praja News : భూ వివాదంపై హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన ఆరోపణల మధ్య కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగత హాజరు హైదరాబాద్: బతుకమ్మకుంట భూ వివాదంపై హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వులు ఉల్లంఘించిన కేసులో హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ శుక్రవారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరై బేషరతుగా క్షమాపణ కోరారు. ఆయన క్షమాపణను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ధిక్కరణ కేసు మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

 

 

జూన్ 12 ఆదేశాలు.. ఉల్లంఘన ఆరోపణలు

 

బతుకమ్మకుంట భూవివాదంలో జూన్ 12న హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను లెక్కచేయక నిర్మాణాలు కొనసాగిస్తున్నారని భూ హక్కులు కోరుతున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి పిటిషన్ వేసిన అనంతరం, కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ కేసు నమోదైంది.

 

గత విచారణలో కోర్టు ఆగ్రహం

 

ధర్మాసనం ఇచ్చిన వ్యక్తిగత హాజరు ఆదేశాలను కూడా రంగనాథ్ పాటించకపోవడంతో గత విచారణలో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయన దాఖలు చేసిన హాజరు మినహాయింపు పిటిషన్‌ను కూడా తిరస్కరించింది.

 

పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రంగనాథ్

 

ఈ నేపథ్యంలో కోర్టు మరోసారి ఆదేశించడంతో ఈరోజు ఆయన హాజరై క్షమాపణ కోరారు. భవిష్యత్‌లో అలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు.

 

తదుపరి విచారణ 18కు

 

కొత్తగా వచ్చిన ఫొటోలు స్టేటస్ కో ఆదేశాల తరువాత కూడా నిర్మాణాలు కొనసాగినట్లు చూపుతున్నాయని ధర్మాసనం తేల్చింది. కేసులో వాదనలు కొనసాగించేందుకు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *