
YSR Praja News Telugu : వికారాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బిల్లు–2025 (VB–G RAM G) ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణ కేంద్రంలో నిరసన చేపట్టారు.
నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జరిగిన ఈ ఆందోళనలో కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అలాగే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, మహాత్మా గాంధీ పేరు తొలగించడం సరికాదు అంటూ డిమాండ్ చేశారు.
నాయకుల వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. వెంకటయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్. మహిపాల్ మాట్లాడుతూ—
పని చేసే హక్కును కల్పించే డిమాండ్ ఆధారిత చట్టమైన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో తీసుకొచ్చిన జి రామ్ జి బిల్లు కేవలం ప్రభుత్వ పథకంగా మాత్రమే మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బిల్లు ద్వారా కార్మికులు చట్టబద్ధమైన హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని వారు అన్నారు.
పని డిమాండ్ మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని, వ్యవసాయ పనులు అత్యంత అవసరంగా ఉండే సమయంలో 60 రోజుల వరకు ఉపాధిని సస్పెండ్ చేసే నిబంధన గ్రామీణ కుటుంబాలను భూస్వాములపై ఆధారపడే పరిస్థితికి నెట్టేస్తుందని విమర్శించారు.
పని ప్రదేశాల్లో డిజిటల్ హాజరును తప్పనిసరి చేయడం అనుచితమని,
వేతనాల చెల్లింపులో 60:40 కేంద్ర–రాష్ట్ర నిష్పత్తి ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం తన బాధ్యతను తగ్గించుకుంటోందని పేర్కొన్నారు.
అలాగే ఎంఎన్‌ఆర్‌ఇజిఎస్ అనే పేరును జి రామ్ జి (GRAM-G) గా మార్చడం వెనుక బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని VB–GRAM-G బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పాల్గొన్న నాయకులు
ఈ నిరసన కార్యక్రమంలో
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప,
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ,
కోశాధికారి బుస్స చంద్రయ్య,
రైతు సంఘం నాయకులు సుదర్శన్, సత్యయ్య, ఎండి. హబీబ్,
ఉపసర్పంచ్ రఘురామ్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.




