ప్రీ ప్రైమరీ స్కూల్స్ రద్దు – తాండూర్‌లో సిఐటియు అంగన్వాడీ యూనియన్ డిమాండ్

ప్రీ ప్రైమరీ స్కూల్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూర్ మండలంలో సిఐటియు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చెన్‌గేష్‌పూర్, ఓగిపూర్ గ్రామాల్లో నిరసన వ్యక్తం చేసింది.

YSR Praja News Telugu : తాండూర్: ప్రీ-ప్రైమరీ స్కూల్స్‌ను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ప్రీ-ప్రైమరీ విద్య బోధనను అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్‌కే అప్పగించాలని CITU తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గట్టిగా డిమాండ్ చేసింది. ఈ మేరకు తాండూర్ మండలంలోని చెన్‌గేష్‌పూర్, ఓగిపూర్ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మరియు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రీ-ప్రైమరీ పీఎం శ్రీవిద్య పేరుతో అంగన్వాడీ సెంటర్లను నిర్వీర్యం చేయడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. గ్రామాల్లో నిరుపేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అందుతున్న సేవలను దెబ్బతీసేలా విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు.

అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్‌కు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలి, మినీ అంగన్వాడీ టీచర్స్ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు పౌష్టికాహారం అందకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రీ-ప్రైమరీ పేరుతో అంగన్వాడీ వ్యవస్థను బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలను కాపాడుకోవడం కోసం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అవసరమైతే కలెక్టర్ కార్యాలయ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ తాండూర్ మండలం నాయకులు మనందమ్మ, చంద్రకళ, సావిత్రిమ్మ, పద్మ, నరేంద్రమ్మ, ఇందిరా, సుజాత, లక్ష్మి, పద్మ, సునీత, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *