YSR Praja News Telugu : తాండూర్, జూన్ 24: యాలాల మండలంలో ఇసుక వేలంపాట వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) శివచరణ్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తాండూర్ ఆర్డీవో కార్యాలయంలో ఏఓకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప మాట్లాడుతూ యాలాల మండల కేంద్రంలో గత రెండేళ్లుగా అనుమతి లేకుండా ఇసుక తరలించిన ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని యాలాల పోలీస్ స్టేషన్‌లో నిల్వ చేశారని తెలిపారు. సుమారు 260 ట్రిప్పులకు సంబంధించిన ఇసుకను అక్కడ డంప్ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఇసుకను వేలం వేయాలంటే బహిరంగంగా పత్రికా ప్రకటన విడుదల చేసి పారదర్శకంగా వేలంపాట నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఆ నిబంధనలను పక్కనపెట్టి ఏకపక్షంగా వేలంపాట నిర్వహించి కొంతమంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగించారని ఆర్ఐ చరణ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు.
అలాగే తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మరియు ఇతర అధికారుల అనుమతులు లేకుండానే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఆయన వ్యవహార శైలివల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సుమారు రూ.10 లక్షల ఆదాయానికి గండి పడిందని ఆరోపించారు.
ఇప్పటికే భూ వివాదాలు, అక్రమ ఎర్రమట్టి తరలింపు వంటి పలు అంశాల్లో కూడా ఆర్ఐ చరణ్ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్న ప్రజాసంఘాల నాయకులు, వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాండూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ తాండూర్ ఇన్‌చార్జ్ మహ్మద్ సాదిక్, కుర్వ సంఘం నాయకులు బాలప్ప, డాక్టర్ ముగ్ధం, తిరుపతి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల నేతలు సమర్పించిన వినతిపత్రాన్ని స్వీకరించిన అధికారులు సంబంధిత అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.




